డిఫాల్టర్లపై చర్యలేవీ?
ఫిజికల్ వెరిఫికేషన్ చేసి..
మిల్లర్లపై
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వేలం పాటలో ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.కోట్లలో ఎగవేతకు పాల్పడిన మిల్లర్లపై అన్ని జిల్లాల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైతే అరెస్టులు కూడా జరుగుతున్నాయి. కానీ సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే మాత్రం ఈ దిశగా చర్యల్లేవు. సర్కారు ధాన్యాన్ని ప్రైవేటు విక్రయించుకుని ఆ సొమ్మును కొన్నేళ్లుగా తమ రియల్ ఎస్టేట్, ఇతర సొంత వ్యాపారాలకు వాడుకుంటున్న మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ డిఫాల్టర్ల పట్ల మెతక వైఖరిని అవలంబిస్తుండటంతో పలు ఆరోపణలకు దారితీస్తోంది. ఈ శాఖ అధికారులు, ఈ శాఖలోని డీటీలు ఇలాంటి మిల్లర్లతో ప్రతి సీజనులో పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకుంటుంటడమే ఈ మెతక వైఖరికి కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రూ.12 కోట్లకు మించే ఎగవేతలు..
ప్రభుత్వం 2022 రబీ సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేలం పాట నిర్వహించింది. సుమారు రూ.44 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని వేలం వేయగా.. మొత్తం 13 మంది మిల్లర్లు దీన్ని కొనుగోలు చేశారు. దాదాపు నాలుగేళ్లుగా కేవలం సుమారు రూ.32 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన సుమారు రూ.12 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించారు. ఈ సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి లాభాలను ఆర్జించారు. కొందరు భూములు కొనుగోలు చేశారు. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. కొందరు ఇదే సర్కారు ధాన్యం డబ్బుతో కొత్త రైసుమిల్లులు ఏర్పాటు చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా సర్కారు సొమ్ముతో సొంత వ్యాపారాలు చేసుకున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు మామూళ్ల కోసమే ఇలాంటి డిఫాల్టర్ల పట్ల మెతక వైఖరిని అవలంభిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తమ సొమ్మేమి కాదులే.. ప్రభుత్వ సొమ్మె కధా అనే దోరణితో వ్యవహరించడంతోనే మిల్లర్ల ఆటలు కొనసాగుతున్నాయనే ఆరోపణలకు దారితీస్తోంది.
వేలం పాట ధాన్యం బకాయిలు రూ.12 కోట్లు
నాలుగేళ్లుగా సర్కారుకు చెల్లించకుండా సొంత వ్యాపారాలకు మళ్లించిన మిల్లర్లు
కేవలం ‘సంప్రదింపు’లతో సరిపెడుతున్న అధికారులు
విమర్శలకు దారితీస్తున్న పౌరసరఫరాలశాఖ తీరు
అధికారుల దృష్టిలో తక్కువేనటా..
మిల్లర్లు తీసుకున్న సర్కారు ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించకుండా ఎప్పటికప్పుడు మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ (పీవీ) చేయాలి. పౌరసరఫరాల శాఖ డిటీలు, ఆశాఖ ఉన్నతాధికారులు ఈ తనిఖీలు చేయాలి. ఒకవేళ ఆ ధాన్యం మిల్లుల్లో లేకపోతే సంబందిత మొత్తాన్ని ప్రభుత్వాకి జమ చేయాలి. ఇలా డబ్బులు జమ చేయకుండా.. మిల్లుల్లో ఉన్న ఫిజికల్ వెరిఫికేషన్‌లో ధాన్యం కనిపించకపోతే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కానీ ఈ ఫిజికల్ వెరిఫికేషన్‌లో చేతివాటం ప్రదర్శించడంతో మిల్లర్లు ఈ సర్కారు సొమ్మును సొంత వ్యాపారాలకు మళ్లించుకున్నారనేది బహిరంగ రహస్యమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల దృష్టిలో రూ.12 కోట్లు అంటే తక్కువేనట.. ఇతర జిల్లాలో ఇంతకు మూడింతలు బకాయిలు ఉన్నారని చెబుతున్నారు. అందుకే వారితో సంప్రదింపులు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ వివరాల కోసం ‘సాక్షి’ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బాలసరోజను వివరణ కోరగా.. యాక్షన్ ప్యాడీ బకాయిల వివరాలు ఇచ్చేది లేదని, పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో తీసుకోవాలని దాటవేశారు.


