హత్నూర(సంగారెడ్డి): ప్రస్తుతం వానాకాలం వరి సాగుకు రైతులు నారు పెంచుతున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ అన్నదాతలకు సూచనలు చేశారు.
నారు మడి కోసం..
రైతులు మొదట నారు కోసం మడిని బాగా దున్ని, మూడు సార్లు దమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు చేయాలి. రెండు గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. వీటితో పాటు పశువుల పేడ కూడా వేయాలి. సేంద్రియ ఎరువు కూడా వేసుకుంటే బాగుంటుంది.
విత్తనం చల్లే విధానం..
మొలక కట్టిన విత్తనాన్ని మడిలో చల్లాలి. మొదట పలుచగా నీరు ఉంచాలి. జింకు లోపం సవరణకు లీటరు నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. నాటు వేయడానికి ఎదిగిన నారుకు వారం ముందు గుంట నారుమడికి 400 గ్రాముల కార్బోరన్ 3జి గుళికలను ఇసుకలో కలిపి చల్లాలి. 15 రోజుల ముందు దమ్ము చేయాలి. జీవన ఎరువులు అనగా అజోలా 150 కిలోలు, 50 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ పొలంలో వేసి మూడు వారాల పాటు పెరగనిచ్చి నేలలోనే కలియదున్నాలి. ఈ విధంగా చేస్తే ఎకరాకు మూడు టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజనిని అందిస్తుంది. భూసారం పెరిగి దిగుబడులు ఎక్కువగా వస్తాయి. నాటిన తరువాత ప్రతి రెండు మీటర్లకు ఒకటి చొప్పున కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి. పంటల సాగులో సమస్యలు తలెత్తితే వెంటనే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్
దున్నడం నుంచి సాగు వరకుజాగ్రత్తలు తప్పనిసరి
నారు పెంపకంపై రైతులకుపలు సూచనలు


