న్యాయం కోసం నిలదీత | - | Sakshi
Sakshi News home page

న్యాయం కోసం నిలదీత

Jul 1 2026 5:02 AM | Updated on Jul 1 2026 5:02 AM

నంగునూరు(సిద్దిపేట): తాము కొనుగోలు చేసిన భూమిని సాదాబైనామా కింద మరొకరి పేరిట బదలాయిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం ఖానాపూర్‌ రైతులు నంగునూరు తహసీల్దార్‌ను నిలదీశారు. కోర్టు ఆర్డర్‌ ఇచ్చిన కాపీని తహసీల్దార్‌ లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గుండెల్లి పోషరాములు 26 ఏళ్ల కింద సర్వే నం.170, 63,75,76లో 5.22 గుంటల భూమిని గుండెల్లి మల్లయ్య వద్ద తెల్లకాగితంపై రాసుకొని భూమి కొనుగోలు చేసి కాస్తులో ఉన్నాడు. 2019లో సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకోగా అధికారులు పట్టాపాసు బుక్కులు అందజేశారు. ఇటీవల తన మనవళ్లు గుడికందుల ప్రవీణ్‌, రవీన్‌ పేరిట చెరి 2.20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించడంతో వారికి పట్టాపాసు బుక్కులు సైతం వచ్చాయి. కాగా.. గుండెల్లి మల్లయ్య సాదాబైనామా కింద పోషరాములు తనకు భూమిని అమ్మాడని కోర్టులో కేసు వేసి తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. విషయం తెలుసుకున్న పోషరాములు, ప్రవీణ్‌, రవీన్‌ కోర్టులో సాక్ష్యాలు సమర్పించడంతో డకెట్‌ ఆర్డర్‌ వచ్చింది. సదురు కాపీని ప్రజావాణిలో సమర్పించిన బాధితులు నంగునూరు తహసీల్దార్‌కు సైతం అందజేసి సాదాబైనామాను నిలిపివేయాలని కోరారు.

న్యాయం చేయకుంటే చావే శరణ్యం

కోర్టు ఉత్తర్వులు అందలేదనే సాకుతో రెవెన్యూ అధికారులు సదరు భూమిని సాదాబైనామా కింద అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు నంగునూరు తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. మల్లయ్య వద్ద డబ్బులు తీసుకొని తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గడ్డి మందుతో వచ్చి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అక్కడి నుంచిపంపించారు.

సాదాబైనామా నిలిపివేశాం

ఖానాపూర్‌కు చెందిన గుండెల్లి మల్లయ్య సాదాబైనామా కింద అందించిన దరఖాస్తును నిలిపివేశాం. బాధితులు ఫిర్యాదు చేసిన మాట నిజమే. వారు తెచ్చిన కోర్టు ఆర్డర్‌ కాపీని తీసుకొని విచారించి న్యాయం చేస్తాం.

– ప్రవీణ్‌ రెడ్డి, తహసీల్దార్‌

గడ్డి మందుతో కార్యాలయంఎదుట నిరసన

కోర్టు ఆర్డర్‌ ధిక్కరించారనిబాధితుల ఆరోపణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement