మూడు రోజుల పాటు చిన్నారులకు చుక్కలు 1,137 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు మొదటిరోజు కేంద్రాలలో, మిగతా రెండు రోజులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సంగారెడ్డి జోన్: పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఐదేళ్ల లోపు ఉన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు పంపిణీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు చిన్నారులకు చుక్కలు వేయనున్నారు. మొదటిరోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో వేస్తారు. మిగతా రెండు రోజులు వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ ప్రాంతాలు, పట్టణ బస్తీలు, కొత్త కాలనీలు, గిరిజన ప్రాంతాల్లో మిగిలిపోయిన చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి వేస్తారు. అందుకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది.
1,80,405 మంది చిన్నారులు.
1,137 కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా ఐదేళ్ల లోపు ఉన్న 1,80,405 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ మేరకు 1137 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,583 మంది ఏఎన్‌ఎంలు, 904 ఆశ కార్యకర్తలు, 1,505 అంగన్‌వాడీ కార్యకర్తలు, 625 ఇతర వలంటీర్లు, ఆరుగురు ప్రోగ్రామ్ అధికారులు పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ చేస్తారు. మొదటి రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ కేంద్రాలు, ఆర్టీసీ బస్టాండ్‌లు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నారు.
ప్రతీ చిన్నారికి రెండు చుక్కలు
ఐదేళ్లలోపు ఉన్న ప్రతీ చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి అపోహలు లేకుండా భయం వీడి చిన్నారులకు పోలియో వ్యాధి సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కేంద్రాల ఏర్పాటుతోపాటు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు.
తప్పనిసరిగా వేయించాలి
ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి. మొదటిరోజు కేంద్రాలలో వేసిన తర్వాత మిగిలిన చిన్నారులకు రెండు రోజులపాటు ఇంటింటికీ తిరిగి వెళ్లి వేస్తారు. గతంలో పోలియో చుక్కలు వేసినప్పటికీ, మరోసారి వేయడం ద్వారా పూర్తి రక్షణ కలుగుతుంది.
–ప్రతీక్ జైన్, కలెక్టర్, సంగారెడ్డి


