ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మిక ఓటర్లపైనే అందరి దృష్టి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పలు పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న వలస కార్మికుల ఓటర్లపైనే అందరి దృష్టి నెలకొంది. బిహార్, యూపీ, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చి సంగారెడ్డి జిల్లాలోని ఖాజీపల్లి, పాశమైలారం, బొంతపల్లి, పటాన్‌చెరు, గడ్డపోతారం, బొల్లారం వంటి పారిశ్రామికవాడల్లో సుమారు 80 వేల మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరు ఓటర్లుగా ఉన్నారు. వీరికి ఆయా రాష్ట్రాల్లోని తమ స్వస్థలాల్లో కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియతో ఒకే చోట ఓటు హక్కు ఉండేందుకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో ఈ వలస కార్మికుల ఓట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరిలో చాలామంది ఓటర్లు ఆయా రాష్ట్రాల్లోని తమ స్వస్థలాల్లోనే ఓటును కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కోల్పోతామనే ఆందోళనతో వీరిలో చాలామంది ఇక్కడి ఓటును వదులుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు.
అరకొరగానే మ్యాపింగ్..
ప్రీ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఓటర్లను 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేసిన విషయం విదితమే. 2002 నాటి ఓటరు జాబితాలోని ఎపిక్ నంబర్ ఉన్న ఓటర్లను ప్రస్తుత ఓటరు జాబితాలోని ఎపిక్ నంబర్‌తో మ్యాపింగ్ చేశారు. ఈ వలస కార్మికులున్న పారిశ్రామికవాడల్లోని పోలింగ్ బూత్‌లలో ఈ మ్యాపింగ్ చాలా తక్కువ నమోదైంది. ఇతర చోట్ల సుమారు 65% ఓటర్ల మ్యాపింగ్ జరగ్గా, ఈ వలస కార్మికులున్న చోట్ల కేవలం 40% కూడా మ్యాపింగ్ జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మే రెండో వారంలో ప్రకటించిన గణాంకాల మేరకు వలస కార్మికులు అధికంగా ఉండే పటాన్‌చెరు నియోజకవర్గంలో 4,30,508 మంది ఓటర్లున్నారు. ఇందులో 40% అంటే సుమారు 1.72లక్షల మంది ఓటర్లు మాత్రమే మ్యాపింగ్ జరిగినట్లు అంచనా. దీంతో మ్యాపింగ్ జరగని సుమారు 2.58 లక్షల ఓటర్లు తప్పనిసరి తమ జనన ధ్రువీకరణ పత్రం వంటి ఆధారాలను అధికారులకు చూపాల్సి ఉంటుంది. అలాగే రెండు, మూడు చోట్ల ఓట్లు ఉంటే ఎక్కడైనా ఒకేచోట మాత్రమే ఓటరుగా కొనసాగాల్సి ఉంటుంది. దీంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక పటాన్‌చెరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని అధికారులు, రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. పటాన్‌చెరుతోపాటు సంగారెడ్డి, జహీరాబాద్ వంటి నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంటుంది. ప్రస్తుతం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి వీటిని ఓటర్లకు అందిస్తున్నారు. ఈ ఫారాలు పూర్తి చేసి, సంబంధిత పత్రాలను జత చేసే ఓటర్ల వివరాలు మాత్రమే ఓటరు జాబితాలో ఉండనున్నాయి.
పారిశ్రామికవాడల్లో ఓటు హక్కు పొందిన యూపీ, బిహార్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు
ఎస్‌ఐఆర్‌లో ఒకే ఓటుకు అవకాశం
దీంతో స్వస్థలాల్లోనే ఓటును కొనసాగించేందుకు మొగ్గు


