కొండపాక(గజ్వేల్): మండలంలోని చిన్నకిష్టాపూర్ క్రాస్ వద్ద మినీ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి ఎంపీ కోటాలో నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆదివారం బీజేపీ నాయకులు ఎంపీ రఘనందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ త్వరలో నిధులు మంజూరు చేసి పనుల ప్రారంభానికి వస్తానంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అనుముల సంపత్‌రెడ్డి, తన్నీరు యాదగిరి, రెడ్డమైన పర్శ రాములు, సదానందగౌడ్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వేలాది కోళ్లు మృత్యువాత!
చుక్కలనంటుతున్న చికెన్ ధరలు
పాపన్నపేట(మెదక్): మండలంలో నెల రోజులుగా గుర్తుతెలియని వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. దీంతో కోళ్ల ఫాంలు వెలవెలబోతున్నాయి. మండలంలో సుమారు 50 వరకు కోళ్ల ఫాంలు ఉన్నాయి. లింగాయపల్లి శివారులోని ఓ ఫాంలో నెల రోజుల క్రితం వేలాది కోళ్లు మృతి చెందినట్లు తెలిసింది. అలాగే పాపన్నపేటలో కూడా వందల సంఖ్యలో కోడి పిల్లలు మృత్యువాత పడ్డట్లు సమాచారం. దీంతో మండలంలోని కోళ్లఫాం యజమానులు సంబంధిత కంపెనీల నుంచి కోడి పిల్లలు తీసుకోవడానికి సాహసించడం లేదు. ఇదే సమయంలో రోజు రోజుకు చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. స్కిన్‌లెస్ కిలోకు రూ. 340, స్కిన్‌తో కలిపి కిలో రూ.320కి అమ్ముతున్నారు. ఇదే విషయమై జిల్లా పశువైధ్యాధికారి వెంకటయ్యను వివరణ కోరగా.. ఎక్కువ మొత్తంలో కోళ్లు చనిపోతే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని ల్యాబ్‌కు పంపడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తామని చెప్పారు.
లారీ ఢీకొని యువకుడి మృతి
మరొకరి పరిస్థితి విషమం
మనోహరాబాద్(తూప్రాన్): ఓవర్‌టేక్ చేసే క్రమంలో కంటైనర్ వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. తూప్రాన్ మండలం ఇమాంపురానికి చెందిన అల్లా డి నిఖిల్ (20) మండలంలోని లింగారెడ్డిపేట్‌కు చెందిన మన్నె స్వామి ఇద్దరు స్నేహితులు. ఆదివారం ఉప్పల్‌లో పరీక్ష రాయడానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో దండుపల్లి వద్దకు రాగానే వెనకాల వేగంగా వచ్చిన కంటైనర్ వీరి ఢీకొట్టింది. ఈఘటనలో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సత్యనారాయణ పిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
రుస్తుంపేట టర్నింగ్ వద్ద..
నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని బ్యాతోల్ గ్రామానికి చెందిన కొండిగళ్ల జంగయ్య (45) బైక్‌పై నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం రుస్తుంపేట టర్నింగ్ వద్ద జంగయ్య ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో మరొకరు..
సంగారెడ్డి టౌన్: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిర్గాపూర్ మండలం ఖాజాపూర్‌కు చెందిన చింతల సురేశ్ (25) వెల్‌నెస్ సెంటర్‌లో టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్టాఫ్ రూమ్‌లో పడుకున్న సురేశ్ నిద్ర లేవకపోవడంతో సిబ్బంది కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరూ రాకుండానే ఎలా తరలిస్తారని కుటుంబీకులు, ఆందోళన చేపట్టారు.


