రామాయంపేట(మెదక్): శిశు మందిరాలు మన సంస్కృతికి నిలయాలని వీహెచ్‌పీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యంజీ పేర్కొన్నారు. పట్టణంలోని అశోక్ సింఘాల్ శిశుమందిర్ పాఠశాల నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. విశ్వభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంయేజక్ హరిస్మరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. అమ్మ ఒడి, చదువుల బడి, దేవుని గుడి బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. మన పిల్లలకు చిన్ననాటి నుంచే మంచి సంస్కారాలు నేర్పిస్తే వారిలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందుతుందని అన్నారు. శిశుమందిర్ సంస్థాపకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో లోపం వల్లే దేశంలో నేరాల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా విద్యార్థుల నృత్యాలు, దేశభక్తి గేయాల ఆలాపన ఆకట్టుకున్నాయి. వీహెచ్‌పీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నరసింహామూర్తి, జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం, పాఠశాల ప్రధానాచార్యులు కవిత, ఇతర ప్రతినిధులు సంగమేశ్వర్, పండరినాధ్, రమణ తదితరులు పాల్గొన్నారు.
వీహెచ్‌పీ తెలంగాణ, ఏపీ కార్యదర్శి సత్యంజీ


