టైగర్‌ టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

టైగర్‌ టెన్షన్‌

Feb 24 2026 9:13 AM | Updated on Feb 24 2026 9:13 AM

టైగర్

టైగర్‌ టెన్షన్‌

పులి దాడిలో పశువులు, జీవాలు మృత్యువాత

హుస్నాబాద్‌రూరల్‌: పులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అడవిలో చెట్లు ఆకులు రాల్చడం,నీటి చలిమెలు అడుగంటిపోయిన సమయంలో జంతువులు ఆహారం కోసం అడవులను దాటి పంట చేళ్లకు వచ్చి తిరిగి వెళ్తుంటాయి. ఈ క్రమంలో అడవి పందులు పంటలను ధ్వంసం చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఇటీవల హుస్నాబాద్‌ డివిజన్‌ పరిధిలోని మద్దూరు, దూళిమిట్ట, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో పులి సంచరించి పశువులపై దాడి చేయడంతో పది పశువుల వరకు మృతి చెందాయి. హుస్నాబాద్‌ మండలంలోని ఉమ్మాపూర్‌ గుట్టపై 2016 ఫిబ్రవరి 5న గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో 12 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 2017 మే 31న మహ్మదాపూర్‌ గుట్ట కిందకు వచ్చిన చిరుత పులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మృతి చెందింది. రైతులు వ్యవసాయ పనులకు, పాల ఉత్పత్తి కోసం పశువులను పెంచుకొని వ్యవసాయ బావుల వద్ద పాకలో తోలడంతో పులి, హైనా లాంటి జంతువులు దాడి చేస్తున్నాయి. దీంతో రైతులకు ఆర్థిక నష్టంతోపాటు ఉపాధిని సైతం కోల్పోతున్నారు.

చంద్రానాయక్‌ తండా సమీపంలో...

కోహెడ మండలం ఆరెపల్లె చంద్రానాయక్‌ తండా సమీప అడవిలోనే పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పులి దొరికితే జూ పార్కుకు తరలించడానికి ఫారెస్టు, జూపార్కు అధికారులు, పూనె, ఢిల్లీ నుంచి పశువైద్యులను రప్పించి వెతుకుతున్నారు. అడవిలో ఉండే పులిని ఇబ్బంది పెట్టకుండా, అది దాటి వస్తేనే పట్టుకోవడానికి అధికారుల బృందం ప్రయత్నం చేస్తుంది.

పరిహారం ఎలా పొందాలి?

ఆర్థిక నష్టంతోపాటు ఉపాధి కోల్పోతున్న రైతులు

బాధితులకు అటవీశాఖ పరిహారం

చంద్రానాయక్‌ తండా సమీపంలో పులి సంచారం

రూ.50వేల వరకు పరిహారం

అడవి జంతువుల దాడిలో పశువులు మరణిస్తే రైతుకు ఒక పశువుకు గరిష్టంగా రూ.50వేల వరకు పరిహారం ఇస్తాం. పంట నష్టం జరిగితే వ్యవసాయ అధికారుల పంచనామా మేరకు ఎకరాకు రూ.10వేలు పరిహారం మూడు నెలల్లో అందుతుంది. అధికారులు పంచనామా చేసిన తర్వాత బాధిత రైతులు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే పరిహారం ఇస్తారు. అడవిలో దాడి చేస్తే పరిహారం వర్తించదు. అడవి దాటి వచ్చి పశువులపై దాడి చేసినప్పుడే నష్టపరిహారం అందుతుంది. అడవిలో జంతువులు ఉంటాయి.. అవి ఉండే చోటికి పశువులను తీసుకెల్లి పరిహారం ఇవ్వాలంటే కష్టం. పులి కోహెడ మండలం ఆరెపల్లి గిరిజన తండా అటవీ ప్రాంతంలోనే ఉంది.

–సిద్ధార్థరెడ్డి, ఎఫ్‌ఆర్వో, హుస్నాబాద్‌

అడవి జంతువుల దాడిలో మరణించిన పశువులకు, పంటల నష్టానికి అటవీశాఖ నష్ట పరిహారం అందిస్తుంది. జంతువుల దాడిలో పశువులు, గొర్రెలు మరణిస్తే బాధితులు మొదట అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అటవీశాఖ, రెవెన్యూ, పశువైద్య అధికారులు విచారణ జరిపి పశువైద్యుల పంచనామా మేరకు నష్ట పరిహారం అంచనా వేస్తారు. మార్కెట్‌ విలువ ఆధారంగా పశువైద్యులు పశువులు, గొర్రెలు, మేకల విలువను ప్రతిపాదిస్తారు. పంట నష్టం జరిగితే వ్యవసాయశాఖ అధికారుల అంచనా మేరకు పరిహారం అందిస్తారు.

టైగర్‌ టెన్షన్‌1
1/1

టైగర్‌ టెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement