పెళ్లయి ఏడాది గడవకముందే విషాదం.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లయి ఏడాది గడవకముందే విషాదం..

Feb 5 2024 5:52 AM | Updated on Feb 5 2024 8:26 AM

- - Sakshi

 వట్‌పల్లి(అందోల్‌): పెళ్లయి ఏడాదైనా గడవకముందే ఓ వివాహిత విద్యుదాఘాతంతో మృతి చెందింది. రోజూ అందరినీ పలకరిస్తూ, కలిసిమెలసి ఉండే ఆమెను అంతలోనే మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన అందోల్‌ మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మాసానిపల్లికి చెందిన బంటు పవిత్ర (21) ఆదివారం ఉదయం ఎప్పటిలాగే నిద్రలేచి, వాకిలి శుభ్రం చేసి వాటర్‌ హీటర్‌తో నీటిని వేడి చేసుకుంది. ఆ నీటితో స్నానం చేసి బట్టలు మార్చుకునే సమయంలో విద్యుత్‌ సరఫరా అవుతున్న హీటర్‌ తాకింది. దీంతో విద్యుత్‌ షాక్‌కు గురైన ఆమె పెద్దగా కేక వేస్తూ కిందపడిపోయింది. పక్కనే మంచంపై నిద్రిస్తున్న భర్త నవీన్‌ లేచి భార్యను పట్టుకోబోయాడు. అతనికీ షాక్‌ తగిలినట్లు అనిపించడంతో వెంటనే హీటర్‌ ప్లగ్‌ను తొలగించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పవిత్రను ఆటోలో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు పరీక్షించి ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించాడు. దీంతో అక్కడే ఉన్న భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఆస్పత్రికి వందలాదిగా బంధువులు
పవిత్ర మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న మృతదేహాన్ని పట్టుకుని తల్లి సుశీల గుండెలు అవిసేలా రోదించింది. ముద్దులు పెడుతూ పవిత్రా.. నువ్వు ఇక లేవా బిడ్డా.. అంటూ ఏడ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారంతా కంటతడి పెట్టారు.

తహసీల్దార్‌ కోసం 3గంటలు నిరీక్షణ
పవిత్రను ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె చనిపోయినట్లు అరగంటలో డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలి భర్త నవీన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే స్థానికంగా తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో మృతురాలి బంధువులు 3గంటలు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు డీటీ చంద్రశేఖర్‌, తహసీల్దారు అంటోనీలు వచ్చి పంచనామా చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement