దుబ్బాక పెట్టిన భిక్షే.. | Sakshi
Sakshi News home page

దుబ్బాక పెట్టిన భిక్షే..

Published Mon, Nov 27 2023 7:08 AM

దుబ్బాక సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌, చిత్రంలో అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి - Sakshi

దుబ్బాకటౌన్‌: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.. పుట్టిన ఈ గడ్డ చరిత్రలో సజీవం.. దుబ్బాక భిక్ష తోనే నేను ఈ స్థాయికి ఎదిగి.. మీ ముందు మాట్లాడుతుండడం చాలా గర్వంగా ఉంది.. ఇక్కడే నేను హైస్కూల్‌ వరకు చదువుకున్నా.. నేను ఉన్నన్నీ రోజులు దుబ్బాకను మరువను అంటూ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ హాజరై ప్రసంగించారు. ‘ప్రభాకర్‌రెడ్డి చాలా మంచోడు.. చీమకు కూడా హాని చేయని వ్యక్తి. సేవ చేయాలని వస్తే చంపాలని చూస్తారా?..’ అంటూ సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక చరిత్రలో ఎప్పుడైనా కత్తిపోట్లు చూశామా.. ఏం అన్యాయం చేసిండని ప్రభాకర్‌రెడ్డిని చంపాలని చూసిండ్రు దేవుడి దయ, మీ ఆశీర్వాదంతోనే ఆయన బతికిండని కేసీఆర్‌ అన్నారు.

బీజేపోడు ఏమన్నా చేసిండా..

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణిస్తే ఆయన సతీమణి సుజాతను దుబ్బాక ఉప ఎన్నికల్లో దింపాం.. కాని అప్పుడు నేను ప్రచారానికి రాలే.. వస్తే వొడిచే పోయేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. చెప్పలేని వాగ్దానాలు చేసి గెలిచిన బీజేపోడు ఏమన్నా చేసిండా గీసొంటి మోసగాడిని గుండుకొట్టి ఈ ఎన్నికల్లో పంపాలన్నారు. ప్రభాకర్‌రెడ్డి రెడు సార్లు ఎంపీగా గెలిచిండు.. ఇప్పుడు ఎంపీగా మళ్లీ గెలుస్తడు.. ఆయన టికెట్‌ అడగలే దుబ్బాక ఎమ్మెల్యేగా సేవలు అవసరమని నేనే టికెట్‌ ఇచ్చా.. ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ కోరారు.

నెలరోజుల్లోనే రెవెన్యూ డివిజన్‌..

ప్రభాకర్‌రెడ్డి గెలిచిన నెలరోజుల్లోనే దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అలాగే దౌల్తాబాద్‌, చేగుంట మండలాల్లో డిగ్రీ కళాశాలలు, రింగ్‌రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానన్నారు. ఇక్కడి దేవాలయాలు నాకు తెలియనివికావని, చిన్నప్పుడు రేకులకుంట మల్లన్న జాతర, కూడవెల్లి జాతరకువెళ్లేవాడిని ఈ ఆలయాలను అన్ని విదాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

చంపాలని చూశారు..

‘ఎంపీగా మచ్చలేని రాజకీయ జీవితం నాది. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే నన్ను చంపాలని చూసిండ్రు.. దేవుడి దయ మీ ఆశీస్సులతోనే బతికి బయటపడ్డా’నని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో కన్నీటి పర్యంతమవుతూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అబద్దాలు చెప్పి గెలిచిన రఘునందన్‌ ఏం చేయలేదని, మూడేళ్లలో ప్రజలు ఏం కోల్పోయారో ప్రజలు గుర్తించారని, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

ఈ స్థాయికి ఎదిగాను..

ప్రాణం ఉన్నంత వరకూ ఈ గడ్డను మరువను

ఎప్పుడైనా కత్తిపోట్లు చూశామా..

సేవచేయాలని వస్తే చంపాలని చూస్తారా?

ప్రభాకర్‌రెడ్డి మంచోడు.. ఆశీర్వదించండి

ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement