హరీశ్‌ హాజరై..అన్నీ తానై | Sakshi
Sakshi News home page

హరీశ్‌ హాజరై..అన్నీ తానై

Published Fri, Nov 17 2023 4:22 AM

గిరిజన సదస్సులో మాట్లాడుతున్న హరీశ్‌రావు - Sakshi

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా చెమటోడుస్తున్నారు మంత్రి హరీశ్‌రావు. గురువారం జిల్లాలో బిజీబిజీగా గడిపారు. బుధవారం రాత్రి సంగారెడ్డిలోనే నిద్రించిన ఆయన ఉదయం ఏడు గంటల నుంచే తన దినచర్యను ప్రారంభించారు. రాత్రి పది గంటల వరకు సుమారు 16 గంటల పాటు వివిధ కార్యక్రమాలు, ప్రచార సభలతో క్షణం తీరిక లేకుండా గడిపారు. పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌లో చేరేలా అన్నీ తానై వ్యవహరించారు.

ముఖ్యనేతల నివాసాలకు..

కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన రాష్ట్ర స్థాయి, జిల్లా నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరేలా మంత్రి హరీశ్‌రావు కీలకంగా వ్యవహరించారు. గురువారం ఉదయమే టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మెదక్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి గాలి అనీల్‌ నివాసానికి వెళ్లిన పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సంగారెడ్డి టికెట్‌ ఆశించి భంగపడిన రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే నివాసానికి వెళ్లిన మంత్రి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

సీపీఎం కార్యాలయానికి స్వయంగా వెళ్లి..

జిల్లాలో సీపీఎం పార్టీ మద్దతు కూడగట్టేందుకు హరీశ్‌రావు స్వయంగా సంగారెడ్డిలోని ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. స్థానిక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతప్రభాకర్‌తో కలిసి సీపీఎం నేతలతో చర్చలు జరిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రమే సీపీఎం పోటీ చేస్తోంది. మిగిలిన చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని ఆ పార్టీ నేతలను కోరారు.

రోడ్‌ షోలు, కులసంఘాల సమ్మేళనాలు..

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హరీశ్‌రావు పలు చోట్ల రోడ్‌షోలు, కుల సంఘాల నేతల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గం హద్నూర్‌లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఐదు నెలల్లోనే విఫలమైన తీరును వివరించారు. ఎస్టీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మంత్రి గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఎరుకల కులస్తులతోనూ ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఈనెల 23న జహీరాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి నుంచి నర్సాపూర్‌లో జరిగిన సీఎం కేసీఆర్‌ బహిరంగసభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం పటాన్‌చెరులోని ఇస్నాపూర్‌ సభకు చేరుకొని సభనుద్దేశించి మాట్లాడారు. ఇలా గురువారం రోజంతా సంగారెడ్డి జిల్లాలోనే గడిపారు.

మల్లేశ్‌తో ముచ్చటించిన మంత్రి..

హద్నూర్‌లో పర్యటించిన హరీశ్‌రావు కర్నాటక రాష్ట్రంతో బంధుత్వం ఉన్న మల్లేశ్‌ అనే వ్యక్తితో ముచ్చటించారు. స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పని చేస్తున్న మల్లేశ్‌ కర్నాటకలోని పరిస్థితులను మంత్రితో తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement