హ్యాట్రిక్‌ కోసం ఒకరు.. మొదటిసారిగా గెలుపే లక్ష్యంగా మరో ఇద్దరు | - | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ కోసం ఒకరు.. మొదటిసారిగా గెలుపే లక్ష్యంగా మరో ఇద్దరు

Nov 11 2023 4:22 AM | Updated on Nov 13 2023 12:01 PM

- - Sakshi

హుస్నాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో వెన్నుదన్నుగా సహాయ సహకారాలు అందించి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒడితెల కుటుంబం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సతీష్‌కుమార్‌ మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని శ్రమిస్తున్నారు. ఎలాగైనా ఈసారి గెలిచి అసెంబ్లీలో తన గళం విప్పాలని కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ పట్టుదలతో ముందుకెళ్తున్నారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు వారసుడిగా మొదటిసారి ఎమ్మెల్యేగా బోణి కొట్టి తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరాంచక్రవర్తి ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో హుస్నాబా ద్‌లో ప్రధాన పార్టీల త్రిముఖ పోరుతో రాజకీయం రసవత్తంగా మారింది.

ఇందుర్తి నుంచి మొదలుకొని పునర్విభజనలో హుస్నాబాద్‌గా మారిన నియోజకవర్గంలోని ఓటర్లు ప్రతీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు. రెండుసార్లు పీడీఎఫ్‌, ఆరు సార్లు సీపీఐ, మూడు సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించాయి. తెలంగాణ సాధన అనంతరం బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) వరుసగా విజయాన్ని దక్కించుకున్నాయి.ఈసారి ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారడంతో ఎవరు గెలుస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమమే గెలిపిస్తాయి
ఒడితెల సతీష్‌కుమార్‌ 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలవాలని నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు సెంట్‌మెంట్‌గా హుస్నాబాద్‌ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభతో గులాబీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. అదే జోష్‌ను కొనసాగిస్తూ ఇప్పటికే సగం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాతో ప్రచారాన్ని ఉధృతం చేశారు. పదేళ్లకాలంలో తాను చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. 2018లో సతీష్‌కుమార్‌ దాదాపు 73 వేలకు పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఈసారి లక్ష మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు నడుస్తున్నారు.

ఉద్యమకారుడిగా ప్రజల్లోకి...
హుస్నాబాద్‌ నుంచి మొదటిసారిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. కరీంనగర్‌ ఎంపీగా పని చేసిన అనుభవం, రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా తెలంగాణ బిడ్డగా తన గళాన్ని వినిపించి పేపర్‌ స్ప్రేకు గురై తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తామని ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌, సీపీఐ పొత్తుతో హుస్నాబాద్‌ సీటును కాంగ్రెస్‌కు కేటాయించిన విషయం విధితమే. సీపీఐ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. టికెట్‌ ఆశించి అలకబూనిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని అధిష్టానంతో మాట్లాడించి మచ్చిక చేసుకున్న పొన్నం ప్రభాకర్‌ ఎలాగైనా ఈసారి గెలవాలని పట్టుదలతో ఉన్నారు.

మోదీ పథకాలే గట్టెక్కిస్తాయి
హుస్నాబాద్‌ బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరాంచక్రవర్తి మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. శ్రీరాంచక్రవర్తి తండ్రి బొమ్మ వెంకటేశ్వర్లు 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. బొమ్మ వెంకటేశ్వర్లు వారసుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి, అయనకు ఉన్న పరిచయాలు తనకు కలిసి వస్తాయని ముందుకు సాగుతున్నారు. తండ్రి తర్వాత కాంగ్రెస్‌ హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటాలు చేశారు. కాంగ్రెస్‌ని అంటిపెట్టుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. తదనంతరం జరిగిన పరిణామాలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ప్రోద్బలంతో శ్రీరాంచక్రవర్తి బీజేపీలో చేరారు. పార్టీ టికెట్‌ రావడంతో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ప్రధాని మోదీ పథకాలు, అభివృద్ధి పనులను జనంలోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement