TS Sangareddy Assembly Constituency: TS Election 2023: అధికారం ఎవరి సొత్తు కాదు! ఒక్క చాన్స్‌ ఇవ్వండి!
Sakshi News home page

TS Election 2023: అధికారం ఎవరి సొత్తు కాదు! ఒక్క చాన్స్‌ ఇవ్వండి!

Published Tue, Sep 12 2023 5:40 AM

- - Sakshi

సంగారెడ్డి: జిల్లాతో బీజేపీకి అవినాభావ సంబంధం ఉందని, రెండు సార్లు మున్సిపల్‌ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇక్కడి ప్రజలు బీజేపీని గెలిపించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు సోమవారం బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పార్టీ విజయ సంకల్ప సభలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని, ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ప్రభుత్వ భూములను అమ్మిన డబ్బులతో జీతాలిచ్చే పరిస్థితికి చేరిందని విమర్శించారు. రానున్న 90 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, కుటుంబం కోసం పనిచేసే పార్టీలను పక్కన బెట్టి, దేశం, రాష్ట్రం కోసం పనిచేసే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్‌ కుటుంబమే బాగుపడుతుందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే సోనియా కుటుంబానికే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ, ప్రధాని మోదీ దేశాన్ని విశ్వగురువుగా నిలుపుతున్నారన్నారు. సమర్థవంతమైన పాలనతో ప్రగతిపథంలో నడుతున్నారని కొనియాడారు.

ఇంట్లో ఇద్దరికి పింఛన్‌: ఈటల
రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుంబంలో ఇద్దరికి పింఛన్లు ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రకటించారు. రైతుబంధు పథకం అర్హులైన రైతులు, కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు. దళితబంధు వంటి పథకాన్ని కలెక్టర్లుకు కూడా ఇస్తామన్న కేసీఆర్‌ తీరును తప్పుబట్టారు. ఈ పథకాన్ని డబ్బులున్న వారికి ఇవ్వబోమని, నిరుపేద దళితులకే అందిస్తామన్నారు.

ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదని విమర్శించారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పలేదన్నారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో బీసీల జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామని తీర్మానం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యం లేదని, కేంద్ర మంత్రి వర్గంలో బీజేపీ వారికి పెద్దపీట వేసిందని వివరించారు. ఈ వర్గాలు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ పులిమామిడిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం.. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారం ఎవరి సొత్తు కాదని, కొందరు నాయకులు గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకుంటామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆ నాయకులు విజయ్‌పాల్‌రెడ్డి, నందీశ్వర్‌గౌడ్‌, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, గోదావరి అంజిరెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement