ఉద్యోగం రావడం లేదని.. బీటెక్‌ విద్యార్థి తీవ్ర నిర్ణయం.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రావడం లేదని.. బీటెక్‌ విద్యార్థి తీవ్ర నిర్ణయం..

Aug 3 2023 3:18 AM | Updated on Aug 3 2023 12:46 PM

- - Sakshi

సంగారెడ్డి: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం దొరకడం లేదు.. తోటి స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారని మనస్తాపం చెందిన యువకుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈసంఘటన మండల పరిధిలోని విఠలాపూర్‌లో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటలక్ష్మి, లక్ష్మారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు.

వీరు వ్యవసాయం చేస్తూ కుమారులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా, చిన్నకుమారుడు ఉపేందర్‌రెడ్డి (25) బీటెక్‌ పూర్తి చేశాడు. ఏడాదిగా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడం.. తోటి స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారని సన్నిహితులతో చెబుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న తన మేనమామ తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్ద మోటారు మరమ్మతుల కోసం ఆయనతో కలిసి వెళ్లాడు.

పని ముగించుకొని తిరుపతిరెడ్డి ఇంటికి రాగా.. ఉపేందర్‌రెడ్డి రాత్రి వరకు ఇంటికి రాలేదు. దీంతో రాత్రి తన మామ వాళ్ల ఇంట్లోనే ఉన్నాడని కుటుంబీకులు భావించారు. బుధవారం ఉదయం తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా గట్టుపైన ఉపేందర్‌ సెల్‌ఫోన్‌, డ్రెస్‌ ఉండడంతో కుటుంబీకులకు సమాచారం అందించాడు. బావిలో వెతకగా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుభాశ్‌గౌడ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement