బీజేపీలో అదంతా జాంతానై.. చివరికి సీఎం యోగి అయినా సరే..

Special Political Story On BJP Party Doctrine And Rules - Sakshi

ఏ రంగంలో అయినా గాడ్ ఫాదర్ కల్చర్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా.. రాజకీయాల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. తమ అనుచరులకు పెద్ద పీట వేయించడానికి నాయకులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. కానీ బీజేపీలో అలాంటివేమీ కుదరవట. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని, పార్టీ పిలుపు మేరకు సమర్థవంతంగా పనులు చేసేవారికే గుర్తింపు, ఎదుగుదల ఉంటుందని హైకమాండ్ చెప్పేసిందట. ఇప్పుడా పరిస్థితి ఎందుకు వచ్చిందో..

నమ్మితే నట్టేట మునిగినట్టే..
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కమలదళం తమ కేడర్కు ఒక సందేశాన్ని.. ఒక విధమైన ఆదేశాన్ని అందించింది. ఇటీవల బిజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ పదాధికారుల సమావేశంలో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ నాయకులు, కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. అధిష్టానం నిర్ణయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారట. నేతలు గ్రూపులు కట్టడం, తమ వెంట వచ్చిన వారికి గాడ్ ఫాదర్ గా కలరింగ్ ఇవ్వడంపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. బీజేపీలో గాడ్ ఫాదర్ సిస్టం ఉండదని స్పష్టత ఇచ్చారట. పార్టీని నమ్ముకుని పని చేసుకుంటూ వెళ్తే పదవులు వాటంతట అవే వస్తాయని నేతలకు దిశానిర్దేశం చేశారట. తొలినుంచీ పార్టీలోనే ఉన్నవారైనా.. కొత్తగా పార్టీలోకి వచ్చినవారైనా.. వస్తున్నవారైనా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని.. గాడ్ ఫాదర్స్‌ను నమ్ముకోవద్దని తరుణ్ చుగ్ తెలంగాణలోని నేతలకు స్పష్టత ఇచ్చారని సమాచారం.

యోగి.. కనిపించే సాక్ష్యం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ను ఉదాహరణగా చూపిస్తున్నారట. ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన యోగి ఆదిత్య నాథ్ కు కూడా పార్టీ ఆయన ఆశించిన నియోజకవర్గంలో టికెట్ ఇవ్వలేదట. ముఖ్యమంత్రిని కాబట్టి రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చనుకున్న ఆయన ఆశయాన్ని పార్టీ ఆమోదించలేదట. మొదట అయోధ్య నుంచి పోటీ చేయాలని యోగి భావించినా.. పార్టీ హైకమాండ్ నో చెప్పిందట. ఆ తర్వాత మధుర నుంచి పోటీకి ప్రయత్నించినా..పార్టీ మాత్రం ఆయన స్వస్థలమైన గోరఖ్ పూర్ నుంచే పోటీ చేయాలని ఆదేశించింది. యోగి అంశాన్ని ఉదాహరణగా చెబుతూ..పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లడమే కార్యకర్త బాధ్యతగా గుర్తించాలని తెలంగాణ కేడర్కు తరుణ్ చుగ్ ఉపదేశం చేశారట. 

గీత దాటితే వేటే
గాడ్ ఫాదర్స్ ఉంటారు.. వారు చూసుకుంటారు.. తమకేమీ కాదనే ధీమా పనికిరాదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారట. పార్టీ హైకమాండ్ ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేసుకుంటూ ముందుకు సాగితే.. పదవులు అవే వస్తాయని దిశా నిర్దేశం చేశారట. నియోజకవర్గాల్లో కొందరు ముఖ్య కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను పక్కన పెట్టి.. రాష్ట్ర నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ లైన్ లో పనిచేయకుండా..గీత దాటితే.. పరిణామాలు వేరే రకంగా ఉంటాయని కూడా తరుణ్చుగ్ పరోక్షంగా చెప్పేశారట. గాడ్ ఫాదర్ కల్చర్కు అలవాటు పడిన కొందరు నాయకులు, కార్యకర్తలు.. అధిష్టానం చెప్పినట్లు పని చేసుకుంటూ వెళ్తారా ? తమ పూర్వపు దారిలోనే ముందుకు సాగుతారా? ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.

పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top