మంచాల: గ్రామాల్లో భూముల సర్వేతో ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మనోహరాబాద్‌లో గురువారం నిర్వహించిన భూ సర్వే అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్వే చేయడం ద్వారా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఏఏ సర్వే నంబర్లు.. ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. పట్టా, ప్రభుత్వ, అటవీ భూములను సైతం గుర్తించడం జరుగుతుందన్నారు. రైతులు ముందుకు వచ్చి సర్వేకు సహకరించాలని కోరారు. అధికారులు సర్వేకు వచ్చినప్పుడు తమ భూములకు సంబంధించిన పట్టా పాసు పుస్తకాలు, భూ ఆధారిత కాగితాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీ రాంరెడ్డి, తహసీల్దార్ ఎం.వెంకట ప్రసాద్, సర్పంచ్ సంజీవ రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


