షాద్‌నగర్: నందిగామ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ఈనెల 7న (శనివారం) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఒక ప్రటకనలో పేర్కొన్నారు. నందిగామ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీఓ భవనం, ఇందిరమ్మ ఇళ్లు, సమాఖ్య భవనం, సెంటర్ లైట్ల ప్రారంభోత్సవాలు, నూతనంగా నిర్మించ తలపెట్టిన తహసీల్దార్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
మీర్‌పేట: సాయివిహార్ కాలనీలో బుధవారం జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుడు షేక్ మహ్మద్ సిద్ధిఖ్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అత్త, బావమరిది భార్యను హత్య చేసిన అనంతరం కారులో శంషాబాద్ వైపు వెళ్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధిఖ్ దాడిలో తీవ్రంగా గాయపడి డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బావమరిది యూసుఫ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, అతని వాంగ్మూలం ఆధారంగా మీర్‌పేట పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు దర్యాప్తు చేస్టున్నట్లు సమాచారం. విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో సిద్ధిఖ్ ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ, దీనిని స్థానిక పోలీసులు నిర్ధారించడం లేదు. పూర్తి విచారణ అనంతరం నిందితుడు అతడిని శుక్రవారం మీడియా ముందు హాజరు పరిచి రిమాండ్ చేసే అవకాశం ఉంది.
షాద్‌నగర్‌రూరల్: ఉద్యకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల సాధనకు సీఎం ఇల్లు ముట్టడికి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం పోలీసులు ముందస్తు బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఉద్యమకారులను పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేశవరావు కమిటీ ద్వారా ఉద్యమకారులను గుర్తించి, వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యమకారుల పక్షాన నిలబడి మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళల ఆర్థిక ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్నట్టు రాష్ట్ర జీవనోపాధుల డైరెక్టర్ డాక్టర్ రాజేశ్వర్ పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ద్వారా మంజూరైన నిధులతో పోల్కంపల్లిలో ఏర్పాటు చేసిన గొర్రె పొటెళ్ల పెంపకం షెడ్డు, నాగన్‌పల్లిలో కోడి పిల్లల పెంపకం యూనిట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకుని తిరిగి చెల్లించాలని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరంతరం మహిళల అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జీవనోపాధుల ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ సతీష్, డాక్టర్ నేహ, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ రాజేందర్, జిల్లా ఫామ్ డీపీఎం నర్సింహ, ఐకేపీ ఏపీఎం సాంబశివుడు, సీసీలు సత్తయ్య, మల్లేశ్, ఆనంద్, జంగమ్మ, గ్రామ సంఘం అసిస్టెంట్‌లు కవిత, జయలక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు.
కుల్కచర్ల: మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థిని అంకిత రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 4న పరిగి పట్టణంలో జరిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. గురువారం అంకితను పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిహెప్సిభా, పీఈటీ కృష్ణారెడ్డి సన్మానించారు. మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.


