బియ్యం.. మాయాజాలం! | - | Sakshi
Sakshi News home page

బియ్యం.. మాయాజాలం!

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

సాక్షి, రంగారెడ్డిజిల్లా: బియ్యం విక్రయాల్లో కొత్తకోణం బయటికి వచ్చింది. కొనుగోలుదారుల్లోని అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్న రైస్‌ మిల్లర్లు, ట్రేడర్స్‌, హోల్‌సేల్‌ డిపోల నిర్వాహకులు, రిటైలర్లు వారికి నాసిరకంగా బియ్యం అంటగడుతుండటంతో పాటు తూనికలు, కొలతల్లో మోసాలకు, జీఎస్టీ పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారు. ఇటు వినియోగదారులనే కాకుండా అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. విషయం జీఎస్టీ అధికారులు, సివిల్‌ సప్లయ్‌ విజిలెన్స్‌ అధికారులకు తెలిసీ కిమ్మనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం కర్మన్‌ఘట్‌ కేంద్రంగా మిల్లర్ల మాయాజాలం బయటపడటంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని రైస్‌ మిల్లర్లు, ట్రేడర్స్‌, హోల్‌సేల్‌ డిపోలు, రిటైలర్లు అప్రమత్తమయ్యారు. రెండు రోజులుగా షాపుల షట్టర్స్‌ మూసివేసి, బ్యాగులను సరి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

తూకంలో మోసం

రేషన్‌ దుకాణాల ద్వారా ప్రభుత్వం పేదలకు ప్రతి నెలా ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తోంది. వానాకాలం సహా యాసంగిలో రైతుల నుంచి ధాన్యం సేకరించి మిల్లర్లకు అప్పగిస్తోంది. మిల్లర్లు ధాన్యాన్ని మరాడించి క్వింటాల్‌కు 67 కేజీల చొప్పున బియ్యం అప్పగిస్తున్నారు. పేదల నోటికాడికి చేరాల్సిన ఈ ఉచిత బియ్యం రేషన్‌షాపులకు చేరకుండానే అక్రమ మార్గంలో మిల్లర్లకు చేరుతోంది. కొంతమంది మిల్లర్లు ఆ బియ్యాన్ని కొత్త బ్యాగుల్లో నింపుతున్నారు. బస్తాపై బియ్యం బ్రాండ్‌ సహా మిల్లు పేరు, అడ్రస్‌, బరువు, కేజీ ధరలను ముద్రిస్తుంటారు. తర్వాత వీటిని గుట్టుగా ప్రైవేటు రైస్‌ ట్రేడర్స్‌, హోల్‌సేల్‌ డిపోలు, రిటైలర్లకు పంపుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్‌ మొదలవుతుంది. ప్రభుత్వం 25 కేజీల బ్యాగుపై ఐదుశాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. ఆపై బస్తాలకు చెల్లింపుల నుంచి మినహాయింపు ఇచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది మిల్లర్లు బ్యాగుపై 26 కేజీలు ముద్రిస్తున్నారు. ఇటు తూనికలు కొలతలశాఖ అధికారులనే కాదు అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. అంతాకాదు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కాకుండా ఇష్టారీతిన విక్రయిస్తున్నారు.

తమదైన‘ముద్ర’

తెలంగాణ బీపీటీ కేజీ రూ.66 చొప్పున 25 కేజీల బస్తాను రూ.1,650కి విక్రయించాలి. తెలంగాణ సోనా బియ్యం కిలో రూ.74 చొప్పున 25 కేజీల కట్టను రూ.1,850కి అమ్మాలి. తెలంగాణ శ్రీరామగోల్డ్‌ బియ్యం కేజీ రూ.79 చొప్పున కట్ట రూ.1,975కి విక్రయించాలి. మెజార్టీ వ్యాపారులు రూ.2,200 విక్రయిస్తున్నారు. అదేమంటే బస్తాపై ముద్రించిన 26 కిలోలను చూపిస్తున్నారు. ఎవరికై నా అనుమానం వచ్చి తూకం వేస్తే.. 25 కేజీల బియ్యం మాత్రమే ఉండడం చూసి తమకు సంబంధం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. శాంపిల్స్‌ సేకరణతో తూకం తగ్గినట్లు చెప్పి పక్కనే మరో వరుసలో ఉన్న 26 కేజీల బ్యాగును తీసి అప్పగిస్తు న్నారు.

బ్రాండెడ్‌ బస్తాలో ‘చౌక’ బియ్యం

జిల్లాలో ఆహార భద్రతకార్డులు 6,75,072 ఉండగా, వీటిలో 23,03,793 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా 14,379 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తుంది. జిల్లాలోని 936 చౌకధరల దుకాణాల ద్వారా ఈ బియ్యాన్ని పేదలకు అందజేస్తోంది. డీలర్లు, మిల్లర్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారులు కుమ్మకై ్క చౌకధరల దుకాణాలకు చేరాల్సిన బియ్యాన్ని నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. మంగళ్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కడ్తాల్‌, ఆమనగల్లు, మక్తమాదారం, చింతపల్లిగూడెం, పోలేపల్లి, కేశంపేట, శంకర్‌పల్లి తదితర ప్రాంతాల్లోని రైస్‌ మిల్లులకు చేరుస్తున్నారు. సదరు మిల్లర్లు గుట్టుగా వాటిని బస్తాల్లో నింపి ప్రైవేటు రైస్‌ ట్రేడర్స్‌, హోల్‌సేల్‌ డిపోల నిర్వాహకులు, రిటైలర్లకు పంపుతున్నారు. 26 కేజీలతో ముద్రించిన బస్తాలో 25 కిలోలు నింపి అమ్ముతున్నారు. మెజార్టీ కొనుగోలు దారులకు ఈ విషయం తెలియకపోవడం వ్యాపారులకు కలిసివస్తోంది.

జీఎస్టీ ఎగవేతలో కొత్తకోణం

రైస్‌ మిల్లర్లు, ట్రేడర్స్‌, హోల్‌సేల్‌ డిపోల నిర్వాకం

బస్తాపై 26 కేజీలు ముద్రణ.. తూకం వేస్తే 25 కిలోలే

తూనికలు కొలతల్లోనూ దగా.. మిల్లులకు రేషన్‌ బియ్యం

వినియోగదారులను మోసం చేస్తున్న మిల్లర్లు, వ్యాపారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement