ఇబ్రహీంపట్నం రూరల్: సమస్యలపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్రారెడ్డి ఫిర్యాదులు స్వీకరించార. ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 116 అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శారదాదేవి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
హుడాకాంప్లెక్స్: జిల్లాస్థాయి యువజనోత్సవాలు ఈనెల 12న నిర్వహించనున్నట్టు కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యువ కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడం, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అవకాశాలు కల్పించడం ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో ఈనెల 12న ఉదయం 9 గంటల నుంచి వేడుకలు ఉంటాయన్నారు. 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువతీయువకులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. జానపద నృత్యం, జానపద గీతాలు, పోస్టర్ తయారీ, వీధి నాటకం, కవిత్వ రచన విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తిగలవారు 11వ తేదీలోపు తమపేరు, వయస్సు, పుట్టినతేదీ, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్, ప్రదర్శన విభాగం తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో నేరుగా గానీ, 98499 09077 నంబర్‌లోగానీ సంప్రదించాలని సూచించారు.
షాద్‌నగర్: విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో సోమవారం బస్తీ దవాఖాన వైద్యుడు దామోదర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో వార్డెన్లు నర్సింలు, సాయిరాం, రామకృష్ణ, ఏఎన్‌ఎం విజయలక్ష్మి, సిబ్బంది కిరణ్, సుజాత, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో మాతాశిశు మృతి ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. కొందుర్గు మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన రాధకు పురిటి నొప్పులు రావడంతో ఇటీవల షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాయంత్రం అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి మాతా శిశువు మృతి చెందారు. ఈ ఘటనను ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకొని త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో డాక్టర్ సీమ మధుకర్, డాక్టర్ షోయబ్, డాక్టర్ సంపత్ సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం సోమవారం ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించింది. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.


