ధర
జిగేలు..
యాచారం: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో పత్తి పంట సాగు చేసిన రైతులకు ఊహించని విధంగా నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 1,64,214 ఎకరాల్లో 80 వేలకు పైగా మంది రైతులు సాగు చేశారు. వానాకాలం ప్రారంభంలో వర్షాలు ఆశించిన విధంగా కురవకపోయిన మున్ముందు కురుస్తాయోనన్న ఆశతో రైతులు తడిపొడి పొలాల్లోనే విత్తనాలు విత్తారు. యాచారం, మాడ్గుల, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు, షాద్‌నగర్ తదితర మండలాల్లో అత్యధికంగా సాగు చేశారు. అడపాదడపా కురిసిన వర్షాలతో పంట ఆశించిన విధంగా ఎదుగుదల లేకుండా పోయింది.
రూ.250 కోట్ల పెట్టుబడులు
జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు కోసం రైతులు సుమారు రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దున్నడం, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కోసం ఎకరాకు రూ.15 వేలకు పైగా వెచ్చించారు. పెట్టుబడుల ఖర్చులు పోను ప్రస్తుతం పత్తి తీతకు రూ.500 చొప్పున కూలీ చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ఈ పనులు కొనసాగుతుండడంతో కూలీలకు డిమాండ్ ఏర్పడింది. కూలీల కొరత, ఎండల తీవ్రతకు చెట్లపై ఉన్న పత్తి రాలిపోతోంది. కనీసం పెట్టుబడులైన వస్తాయనే ఆశతో కూలీలకు ముందే అడ్వాన్స్‌లు ఇచ్చి పత్తి తీత పనులు చేయిస్తున్నారు. స్థానిక కూలీల కొరత దృష్ట్యా మాడ్గుల, తలకొండపల్లి, యాచారం మండలాల్లోని పలువురు రైతులు ఏపీలోని కర్నూల్, మాచర్ల తదితర ప్రాంతాల నుంచి రప్పించుకుంటున్నారు.
మొదటి తీతకే పంట లూటీ
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఒక్కో చెట్టుకు 40కి పైగా కాయలు కాసే అవకాశం ఉంటుంది. అదునులో వర్షాల్లేక ఒక్కో చెట్టుకు పది లోపే పూత పూసి కాత కాసింది. పూసిన పూత కూడా పూర్తిగా కాయలు కాసి పత్తి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. గతంలో సమృద్ధి వర్షాలు కురిసిన రోజుల్లో ఒక్కో మండలంలో ఒక్కో విధంగా ఎకరాకు పది నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ప్రస్తుతం ఏ మండలంలో చూసినా కనీసం మూడు, నాలుగు క్వింటాళ్ల దిగుబడి కూడా లేకుండా పోయింది. తీస్తున్న పత్తితో మొదటి తీతకే పంటంతా లూటీపోయినట్లు కనిపిస్తోంది.
ఊహించని ధరతో ఆవిరైన ఆశలు
ఈ ఏడాది పత్తి ధర ఊహించని విధంగా ఉంది. సీసీఐ కేంద్రాల్లోనే కాకుండా ఆయా మండలాల్లోని దళారులు పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ.9,400కు పైగా ధర పలుకుతోంది. జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన 1,64,214 ఎకరాల్లో ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తే రైతులకు రూ.1,250 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. నాలుగు క్వింటాళ్ల లోపే వస్తుండడంతో రూ.650 కోట్లకుపైగా ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. రెండు, మూడేళ్లుగా ధరలు ఆశించిన విధంగా పెరుగుతూ వస్తున్నాయి. మంచి ధరలున్న సమయంలో దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తోంది.
మాడ్గుల మండల కేంద్రానికి చెందిన బత్తుల మోహన్‌రెడ్డి తనకున్న 52 ఎకరాల్లో ఎకరాకు రూ.15 వేలు ఖర్చు చేసి పత్తి సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో పూత, కాత ఆశించిన విధంగా లేకపోయింది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి ఉండేది. ప్రస్తుతం పత్తి తీత పనులు చేపట్టాడు. ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. ఊహించని విధంగా ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.9,400కు పైగా మార్కెట్లో డిమాండ్ ఉంది. దిగుబడి లేక మంచి లాభాలు పొందలేక, పెట్టుబడులు ఖర్చులే మిగిలే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
యాచారం గ్రామానికి చెందిన నర్సింహ ఓ భూస్వామి వద్ద పది ఎకరాల పొలాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. రూ.లక్షన్నర ఖర్చు చేసి పత్తి సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో పూత, కాత అసలే లేదు. ఎకరాకు కనీసం మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. కౌలు, కూలీల ఖర్చు కూడా రిని పరిస్థితి. కొద్దిపాటిగా ఉన్న పత్తిని కూలీల ద్వారా తీయిస్తున్నాడు. ఒకే తీతకు పంటంతా పూర్తిగా లూటీ పోతున్నట్లు కనిపిస్తోందని వాపోతున్నాడు.
వర్షాభావ పరిస్థితులతో
గణనీయంగా తగ్గిన పత్తి
జిల్లాలో 1.64 లక్షల ఎకరాలకు పైగా పంట సాగు
ఊహించని విధంగా క్వింటాల్‌కు రూ.9 వేలకు పైగా ధర
అదునులో వర్షాల్లేక ఎకరాకు
నాలుగు క్వింటాళ్ల లోపే దిగుబడి
రైతులపైనే పెట్టుబడి భారం
దిగుబడి గణనీయంగా తగ్గింది
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో పత్తి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఎకరాకు కనీసం నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత ధరతో దిగుబడి ఉంటే మంచి ఆదాయం వచ్చేది. చెట్లకున్న పత్తి ఒకేసారి తీతకు రావడంతో తర్వాత తీసే అవకాశం లేకుండా పోతుంది. మంచి ధరతో పెట్టుబడులు, ఖర్చులైనా భారం కాకుండా ఉంది.
– సుజాత, జిల్లా వ్యవసాయాధికారి


