సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: సమస్యలు పరిష్కరించాలని వైద్య విద్యార్థులు చేపట్టిన నిరసనలు సోమవారం మిన్నంటాయి. ఆదిభట్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంగళ్‌పల్లి భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మహేశ్వరం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు, పర్మినెంట్‌ ప్రాక్టికల్స్‌, హాస్టల్‌ వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సోమవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. గత నెల 12న ప్రిన్సిపాల్‌కు సమ్మె నోటీసు అందించిన వారు తరగతులు, క్లినికల్‌ పోస్టింగులను బహిష్కరించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తరగతులు చేపట్టొద్దని కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా మంగళ్‌పల్లి గేటు వద్దకు వచ్చి సాగర్‌రహదారిపై రాస్తారోకో చేశారు. 2024 నవంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యాయని, ఆరు నెలల్లో టిమ్స్‌ ఎల్‌బీనగర్‌కు తరలిస్తామని 2024 బ్యాచ్‌కు, రెండు నెలల్లో తరలిస్తామని 2025 బ్యాచ్‌కు హామీలిచ్చినా నేటికీ ఆచరణకు నోచుకోలేదని విద్యార్థులు మండిపడ్డారు. ప్రస్తుతం మూడు ఎంబీబీఎస్‌ బ్యాచ్‌లు ఉన్నా కనీస వసతులు కరువయ్యాయన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు లేక ప్రైవేటులో చేరడంతో మోయలేని భారం అవుతోందన్నారు. నెలకు రూ.7,500 నుంచి రూ.10వేల వరకు అద్దెలు చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. సరైన సెక్యూరిటీ, వీధి దీపాలు లేకపోవడంతో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తాత్కాలిక క్యాంపస్‌ నుంచి బోధనాస్పత్రికి ప్రతి రోజు 40 కి.మీ ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ప్రత్యేక బస్సు సౌకర్యం లేకపోవడంతో క్లినికల్‌ పోస్టింగులు, ఎన్‌ఎమ్‌సీ ఫీల్డ్‌ విజిట్లకు తీవ్ర విఘాతం కలుగుతోందని తెలిపారు. మైదానం, లైబ్రరీపై ఆంక్షలు ఉన్నాయన్నారు. వాహనాలు లోనికి అనుమతించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు తీర్చే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు.

మహేశ్వరం కళాశాల ఎదుట

మెడికోల నిరసన

మౌలిక సదుపాయాలు లేవని ఆందోళన

కాలేజీ నుంచి సాగర్‌రహదారి వరకు ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement