ఆరుతడి పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగు చేయాలి

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

ఆరుతడి పంటలు సాగు చేయాలి జిల్లా వైద్యాధికారికి సన్మానం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు బెల్ట్‌ దుకాణాలు బంద్‌ చేయాలని తీర్మానం

మంచాల: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి సుజాత అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే 15శాతం బోరు బావులు ఎండిపోయాయని, భవిష్యత్‌లో మరో 40 శాతం ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోయి సాగు నీరే కాదు, తాగు నీటి సమస్య కూడా తీవ్రరూపం దాల్చనుందన్నారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్‌లు, స్ప్రింక్లర్లు సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ వెదెరె హన్మంత్‌ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకృష్ణ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సురేష్‌, ఏడీఏలు పద్మజ, శశిధర్‌రెడ్డి, ఏఓ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

హుడాకాంప్లెక్స్‌: ఇటీవల జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తికి మంగళవారం తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అసోసియేషన్‌ తరఫున జిల్లా కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ బి.పరాంకుశం, పి.శ్రీనివాసులు, ఎండీ షాయాద్‌, చిట్టిబాబు, ఎండీ రఫీక్‌, కళమ్మ పాల్గొన్నారు.

ఆమనగల్లు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఫ్యూచర్‌సిటీ ట్రాఫిక్‌ డీసీపీ శివం ఉపాధ్యయ తెలిపారు. మండలంలో ఉన్న హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రమాదకర బ్లాక్‌ స్పాట్లను మంగళవారం స్థానిక పోలీసు, మున్సిపల్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగిస్తామన్నారు. పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న దుకాణాలు, ఆక్రమణలను తొలగించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూస్తామని వివరించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఆమనగల్లు ట్రాఫిక్‌ సీఐ శంకరయ్య, మహేశ్వరం ట్రాఫిక్‌ సీఐ అశోక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంచాల: మండలంలోని ఆరుట్లలో బెల్ట్‌ దుకాణాలు బంద్‌ చేయాలని పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసింది. ఈ మేరకు మంగళవారం మంచాల ఎస్‌ఐ నాగేశ్వర్‌ రావుకు తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మానుపాటి శోభ కుమార్‌, ఉప సర్పంచ్‌ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. గ్రామంలో విచ్చిలవిడిగా మద్యం దుకాణాలు వెలిశాయన్నారు. యువత మద్యానికి అలవాటుపడి బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకోకూడదని, గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే కచ్చితంగా మద్యం విక్రయాలను నిలిపి వేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పున్నం రాము, పద్మ, శ్రావణ్‌, శేఖర్‌, బాను, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement