హుడా కాంప్లెక్స్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఇటీవల జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళికను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. కొత్తపేట సాయి సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మంగళవారం రాత్రి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మణుగూరు ఆర్టీసీ బస్సులో చిల్లర విషయంలో ప్రయాణికురాలితో జరిగిన వాగ్వాదం సందర్భంగా ప్రయాణికురాలు కండక్టర్ ప్రవళికను తోసేయడంతో కిందపడింది. ఈ క్రమంలో బస్సు టైర్లు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. భద్రాద్రి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రవళికకు అందుతున్న వైద్య సేవలను పొన్నం వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలిగానీ, ఇలా భౌతిక దాడులకు పాల్పడటం సరికాదన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, నాయకులు కేఎల్లార్, దేప భాస్కర్‌రెడ్డి, చిలుక ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


