తుర్కయంజాల్: ఆదిభట్ల సర్కిల్ పరిధి రాగన్నగూడలోని తారా చిల్డ్రన్స్ అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో డెంగీ లక్షణాలతో చికిత్స పొంది మృతి చెందిన వినూత్ మృతిపై విచారణ జరుపుతున్నట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. మంగళవారం ఆయన వివాదానికి కారణమైన ఆస్పత్రిని అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రిలో బాలుడికి అందించిన చికిత్స, వైద్య రికార్డులు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని, విచారణలో నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మంజుల, మండల వైద్యాధికారి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్‌రూరల్: అథ్లెటిక్స్‌లో చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని వైష్ణవి అద్భుత ప్రతిభకనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా మంగళవారం గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ మాలతి విద్యార్థినిని అభినందించారు. 70వ ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి పోటీల్లో వైష్ణవి 100 మీటర్లు, 200 మీటర్లలో బంగారు పతకాలు సాధించిందని తెలిపారు. దీంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందని చెప్పారు.
ఆమనగల్లు: తలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పలువురు పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్‌లను గుర్తించి పోలీసులు తిరిగి బాధితులకు అప్పగించారు. దొంగిలించబడిన సెల్‌ఫోన్‌లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి రికవరీ చేశారు. తలకొండపల్లి పోలీసు స్టేషన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 11 మంది బాధతులకు సీఐ జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ కానుగుల శేఖర్ సెల్‌ఫోన్‌లు అప్పగించారు. రికవరీలో చొరవచూపిన క్రైం కానిస్టేబుల్ జాషువాను సీఐ అభినందించారు.
● ముగ్గురికి గాయాలు
● ఒకరి పరిస్థితి విషమం
ఇబ్రహీంపట్నం రూరల్: అతివేగంగా వచ్చిన కారు డ్రైవర్ నిద్రమత్తులో ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టిన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన కొపునమోని సాయికిరణ్ కరాటే మాస్టర్‌గా పని చేస్తున్నాడు. కరాటే ఈవెంట్ కోసం సహస్ర అనే బాలికను తీసుకొని వెళ్లి సోమవారం రాత్రి తిరిగి బోడుప్పల్ వైపు కారులో స్నేహితులు వివేక్, నవీన్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు. పెద్దంబర్‌పేట్ వద్ద ఎగ్జిట్ 12 సమీపంలో ముందు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీని కారు డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వివేక్, సహస్ర, సాయికిరణ్‌కు గాయాలయ్యాయి. వివేక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు.
కేశంపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని వేములనర్వ శివారు నంబయ్యగుట్ట సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టోనిగూడ పంచాయతీ పరిధిలోని కంకిరాళ్లతండాకు చెందిన బాలునాయక్ మంగళవారం రాత్రి బైక్ వేముల్‌నర్వ నుంచి తండాకు వెళ్తుండగా నంబయ్యగుట్ట సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ కనిపించకపోవడంతో బైక్ అదుపు తప్పి ఆమెను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలునాయక్‌తో పాటు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ గ్రామస్తులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


