ఇబ్రహీంపట్నం: కార్తీక మాసంలో నిర్వహించే ఆరుట్లలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో మంచాల మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 8వ వరకు (15 రోజులు) నిర్వహించే బుగ్గ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి ఇబ్బందులు కలగకుండా సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జాతర పరిసరాల్లోనే కాకుండా సమీప గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్, రోడ్లు, భద్రత తదితర సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. అవసరమైన చోట్ల అదనపు పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, వీధి లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. అదనపు బలగాలను మోహరించి ముందస్తు భద్రతను పోలీసు శాఖ ఏర్పాటు చేసి ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. జాతరకు వచ్చే మార్గాల్లో అదనపు బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాతకు సూచించారు. భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందిచాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశించారు. ఏర్పాట్లకు కోటి రూపాయలు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు ఫోన్‌లో కలెక్టర్‌ను సంప్రదించగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆధ్యాత్మిక వైభవం, ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకోవాలని, అందుకు భక్తులు సహకరించాలని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హనుమంతురెడ్డి, ఎంపీడీఓ వసంతలక్ష్మి, గ్రామ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఉత్సవాలకు కోటి రూపాయలు కేటాయించాలని కలెక్టర్‌కు వినతి


