న్యూస్‌రీల్
కరెంట్ కోతలు.. ఆగిన మోటార్లు
ఇసుక అక్రమ రవాణా ఈసీ వాగు నుంచి ఇసుక దందా జోరుగా సాగుతోంది. అక్రమంగా రవాణా చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.
జలం..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూగర్భ జలాలు పాతాళానికి వేగంగా పడిపోతున్న జిల్లాల జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి తెలంగాణలోనే ముందు వరుసలో నిలిచింది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది 5.43 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఆశించినస్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడానికి తోడు శివారు ప్రాంతాలు పూర్తిగా కాంక్రీట్ జంగిల్స్‌గా మారడం, భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తుండటం, గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల కోసం నీటిని తోడేస్తుండటంతో వేగంగా పాతాళానికి పడిపోతున్నాయి. ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోని బోరుమోటార్లు ఎండిపోతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గురుకులాలు, హాస్టళ్లు, హోటళ్లు, ఆస్పత్రులు, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో నీటి కటకట తప్పడం లేదు. పైపులైన్ల ద్వారా కృష్ణా, గోదావరి జలాలను జలమండలి సరఫరా చేస్తున్నా అవసరాలు తీరడం లేదు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
13 మండలాల్లో లోటు వర్షపాతమే..
సాధారణంగా జిల్లాలో సెప్టెంబర్ చివరి నాటికి 547.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 468 మిల్లీ మీటర్లకు మించలేదు. మైనస్ 14.6 శాతం లోటు నమోదైంది. 27 మండలాల్లో కేవలం ఒక మండలంలో (షాబాద్‌లో 26.2 శాతం) అధిక వర్షపాతం నమోదైంది. 13 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వీటిలో కొందుర్గులో 18.9 శాతం, కేశంపేటలో 16.3, నందిగామలో 12.6, మొయినాబాద్‌లో 5.9, చేవెళ్లలో 3.8, మాడ్గులలో మైనస్ 5.0, శంకర్‌పల్లిలో మైనస్ 6.7, శేరిలింగంపల్లిలో మైనస్ 7.1, రాజేంద్రనగర్‌లో మైనస్ 8.0, ఫరూఖ్‌నగర్‌లో మైనస్ 8.6, చౌదరిగూడలో మైనస్ 14.5 శాతం వర్షపాతం నమోదైంది. కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్, గండిపేట్, శంషాబాద్, బాలాపూర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, మంచాల, తలకొండపల్లి, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం మండలాల్లో సాధారణం కంటే అతి తక్కువై లోటు వర్షపాతం నమోదైంది.
మరింత లోతుకు భూగర్భ జలమట్టం
ఎండిపోతున్న పొలాలు, ఆందోళనలో రైతులు
పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా
కరెంట్ కోతలపై కన్నెర్ర.. సబ్‌స్టేషన్ల ముట్టడి
చేవెళ్ల, షాద్‌నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో పంటలు వాడిపోతున్నాయి. మెజార్టీ బోర్లు ఇప్పటికే ఎండిపోయాయి. చెరువులు, కుంటల కింద ఉన్న బోరు బావుల్లో నీరు ఉన్నప్పటికీ.. కరెంట్ కోతలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్యతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు సహా మోటార్లు కాలిపోతున్నాయి. జిల్లాలోని మూడు సర్కిళ్ల పరిధిలో 3,298 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయంటే క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్, సరఫరా తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరెంట్ లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు. మహేశ్వరం, కందుకూరు, తలకొండపల్లి, కేశంపేట, కొందుర్గు, మంచాల, మాడ్గుల మండలాల్లోని రైతులు ఇప్పటికే రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఎండిపోయిన పంటల వివరాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదించడంలో సంబంధిత శాఖలు మొద్దునిద్ర వీడటం లేదు.


