అడ్డుకట్ట పడేనా? | - | Sakshi
Sakshi News home page

అడ్డుకట్ట పడేనా?

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

తుర్కయంజాల్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ఆలస్యంగానైనా చర్యలకు ఉపక్రమించారు. ప్రమాదాలను తగ్గించడానికి ప్రజలు సమష్టిగా కృషి చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్‌ కిరణ్మయి ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు, పలు రోడ్లను పరిశీలించిన విషయం తెలిసిందే. జిల్లాలో ప్రమాదాలకు కారణం అవుతున్న రహదారుల్లో విజయవాడ నేషనల్‌ హైవేతో పాటు, సాగర్‌ రహదారి మరొకటి. వీటికి తోడు ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌ 44, శ్రీశైలం హైవే, చేవెళ్ల– మన్నెగూడ రహదారి (ఎన్‌హెచ్‌–163), చేవెళ్ల –షాబాద్‌ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రమాదాలకు కారణం అవుతున్న

రహదారులు..

● హైదరాబాద్‌ నుంచి నాగార్జున సాగర్‌ ప్రధాన రహదారిపై రోజు రోజకూ రద్దీ పెరగడంతో పాటు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రధానంగా సాగర్‌ కాంప్లెక్స్‌, ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ, గుర్రంగూడ అటవీ ప్రాంతం, ఇంజాపూర్‌ చౌరస్తా, మాసబ్‌ చెరువు కట్టపై, తుర్కయంజాల్‌ చౌరస్తా, బ్రాహ్మణపల్లి చౌరస్తా, మన్నెగూడ, బొంగుళూరు చౌరస్తాలు ప్రమాదాలకు అడ్డాగా మారాయి. ఇవే కాకుండా గున్‌గల్‌ గేట్‌, తక్కళ్లపల్లి గేట్‌, తుమ్మలోనిగూడ గేట్‌, మాల్‌ మైసమ్మ ఆలయం పరిసర ప్రాంతాలు, గురునానక్‌ కళాశాల సమీపంలో ఎక్కువగా జరుగుతుంటాయి.

● విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు ఎల్‌బీనగర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దు వరకు కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే కొద్ది మేర ప్రమాదాలను నివారించవచ్చు. అధికారులు, కాంట్రాక్టర్‌ల నిర్లక్ష్యంతో పనులు పూర్తి చేయకపోవడంతో పనామా చౌరస్తా, ఆటోనగర్‌, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అబ్దుల్లాపూర్‌ మెట్‌, ఇనాంగూడ, కొత్తగూడెం వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

● జిల్లాలో అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరిగే వాటిల్లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు ముందు వరుసలో ఉంటుంది. ఓఆర్‌ఆర్‌పై వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడంతోనే అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగంగా వచ్చే వాహనాలు కంట్రోల్‌ తప్పి నిలిపి ఉన్న వాహనాలను ఢీకొట్టిన సంఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే కాకుండా ఎగ్జిట్‌ పాయింట్‌ల వద్ద ముందే గమనించకుండా సడెన్‌గా వాహనాలను తిప్పడం కూడా మరో కారణం.

● జిల్లాలో అత్యంత ప్రమాదకర మార్గాల్లో మరొకటి చేవెళ్ల–మన్నెగూడ రహదారి. బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడంతో ఈ మార్గంలోని అప్పా జంక్షన్‌, మొయినాబాద్‌, చేవెళ్ల, మీర్జాగూడ, మన్నెగూడ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రమాదకరమైన మలుపులు, డివైడర్‌ లేకపోవడం, రోడ్డు ఇరుగ్గా ఉండడం, గుంతలతో తరచూ భారీ ప్రమాదాలు జరిగేవి. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పూర్తయితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.

ప్రధాన కారణాలు

అధిక శాతం రోడ్డు ప్రమాదాలకు కారణం మితిమీరిన వేగం. వేగ నియంత్రణ లేకపోవడం, డ్రైవర్‌ల నిద్ర మత్తు, మద్యం మత్తులో వాహనాలు నడపడం, ప్రమాదకర మలుపులు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రిఫ్లెక్టర్‌లు లేకపోవడం, ఓవర్‌టేక్‌, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం, వీధి దీపాలు వెలగకపోవడం, రాత్రి పూట వెలుతురు తక్కువగా ఉండటం, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన, పాదచారులకు పుట్‌పాత్‌లు, జీబ్రా క్రాసింగ్‌లు, సురక్షితంగా రోడ్డు దాటే ఏర్పాట్లు లేకపోవడంతో అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రమాదాలకు కారణం అవుతున్న ప్రాంతాలు 98, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించనవి 99, పాదచారులు రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నవి 66 గుర్తించినట్లు ఇటీవల జరిగిన సమావేశాల్లో అధికారులు వెల్లడించారు.

నిబంధనలు పాటిస్తేనే..

పోలీసులు, రోడ్లు భవనాల శాఖ, జాతీయ రహదారుల శాఖ అధికారులతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, రవాణ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలు ఎక్కువగా జరిగే వాటిని బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించడం, స్పీడ్‌ బ్రేకర్‌ల ఏర్పాటు, రేడియం సూచికలు, ఎప్పటికప్పుడు గుంతలను పూడ్చడం, వీధి దీపాల ఏర్పాటు, మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్‌రూట్‌ ప్రయాణంపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని విశ్లేషకుల వాదన. ప్రజలు కూడా నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ప్రమాదాలు తగ్గుముఖం పట్టేనా..

నివారణకు అధికారుల కార్యాచరణ

ప్రమాదాలకు కారణం అవుతున్న ప్రాంతాల గుర్తింపు

చర్యలకు ఇటీవల అదనపు కలెక్టర్‌ ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement