అమ్ముడవక.. తీసుకెళ్లలేక | - | Sakshi
Sakshi News home page

అమ్ముడవక.. తీసుకెళ్లలేక

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

పారబోసిన వాటిని పశువులకు మేతకోసం తీసుకెళ్తున్న దృశ్యం

చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అమ్ముడుపోని కూరగాయలు

చేవెళ్ల: ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం ఒకెత్తయితే.. పండించిన ఉత్పత్తులను అమ్ముకోవడం రైతన్నకు అంతకన్నా భారంగా మారింది. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌కు కూరగాయల దిగుబడులు అధికంగా వస్తుండడంతో ఆశించిన ధర లభించడం లేదు. మార్కెట్‌కు తీసుకు వచ్చిన కూరగాయలు అమ్ముడుపోక మిగిలిపోతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. శ్రమించి పండించిన పంటను చివరికి పశువులకు మేతగా వేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో లేక నీటికొరత ఏర్పడిన పరిస్థితుల్లో పంటలను కాపాడుకుంటూ తీరా మార్కెట్‌కు తెస్తే ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడులు నష్టపోతున్నామని వాపోతున్నారు.

మిగిలిపోతున్న కూరగాయల గుట్టలు

వంకాయి, కాకర, మిర్చి, క్యాబేజీ, బీరకాయి, గోకర, ఇతర కూరగాయల దిగుబడులు ఎక్కువగా వస్తుండటంతో రైతులు చేవెళ్ల మార్కెట్‌కు తీసుకు వస్తున్నారు. ఆశించిన ధర లేక.. మొత్తం సరుకు విక్రయం కాక మిగిలిపోతున్నాయి. వాటిని తిరిగి తీసుకెళ్లడం కూడా భారంగా మారడంతో కొందరు రైతులు అక్కడే వదిలి వెళ్తున్నారు. దీంతో మిగిలిపోయిన కూరగాయలను పశువులు ఉన్న వారు వచ్చి మేత కోసం తమ వాహనాల్లో తీసుకెళ్తున్నారు. మార్కెట్‌లో నిత్యం విక్రయించే సరుకులకంటే ఎక్కువ దిగుబడులు రావడంతో అమ్ముడు పోవడం లేదని కమీషన్‌ ఏజెంట్లు చెబుతున్నారు. ఇక్కడ మార్కెట్‌లో అన్ని కూరగాయలు కలిపి రోజుకు 3 క్వింటాళ్ల వరకు డిమాండ్‌ ఉండగా దాదాపు 6 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నాయని తెలిపారు. ఏది ఏమైనా పండించిన రైతు మాత్రం ఇది తీరని నష్టం అని వాపోతున్నారు.

చేవెళ్ల మార్కెట్‌కు అధికంగా కూరగాయల దిగుబడులు

ఆశించిన ధర రాక.. తెచ్చినవి విక్రయం కాక వదిలి వెళ్తున్న రైతులు

పశువులకు మేతగా మారుతున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement