అంబేడ్కర్‌ జాతీయ అవార్డుకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జాతీయ అవార్డుకు ఎంపిక

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

అంబేడ్కర్‌ జాతీయ అవార్డుకు ఎంపిక ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో పదసంచాలన్‌ దాడిచేసిన వారిని శిక్షించాలి డ్రగ్‌ టెస్టులో ఒకరికి పాజిటివ్‌

షాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జాతీయ అవార్డుకు మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన అప్పలి శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా ఎంపిక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా అప్పలి శ్రీనివాసులు మాట్లాడుతూ.. అవార్డుకు ఎంపికవడం ఆనందంగా ఉందన్నారు. నవంబర్‌ 15న న్యూ ఢిల్లీలో జరిగే 20వ జాతీయ సదస్సులో ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఎస్‌ఏ రాష్ట్ర నాయకులు మల్లగళ్ల మల్లేష్‌, కోటేశ్వరరావు, విజయ్‌కుమార్‌, విష్ణవర్ధన్‌, అవార్డుల ఎంపిక కమిటీ సభ్యులు, ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చొక్కంపేట ఆంజనేయులు, సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు.

తుర్కయంజాల్‌: శ్రీరాముడు, రావణాసురుడి మీద విజయం సాధించడానికి గుర్తుగా.. మహాభారతంలో పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం గడిపి విజయం సాధించడానికి గుర్తుగా ఏటా విజయ దశమిని జరుపుకొంటున్నామని విశ్రాంత యువసేన అధికారి, ప్రముఖ సంఘ సేవకుడు సీబీఆర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం తొర్రూర్‌ డివిజన్‌ న్యూ సూభాష్‌ నగర్‌లో నిర్వహించిన విజయదశమి పదసంచాలన్‌ కార్యాక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్క స్వయం సేవక్‌ నిమగ్నమై ఉండాలని, దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అన్నారు. కొంతమంది యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, లవ్‌ జిహాద్‌, మత మార్పిడులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సేవ ప్రముఖ్‌ గాజుల శివ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల: మండలంలోని రేగడిఘనాపూర్‌లో దళితుడిపై జరిగిన దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారపు సరోజన, కోశాధికారి ఎర్ర మోహనకృష్ణ, నాయకులు కిష్టప్ప అన్నారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించి, దాడి జరిగిన బాధితుడు భాస్కర్‌ను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా వేడుకల్లో దళితుడైన భాస్కర్‌పై దాడికి పాల్పడిన అగ్రకులానికి చెందిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోన్నట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటికై నా పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే బాధితుడి పక్షాన పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు భాస్కర్‌, అంతయ్య, బుచ్చమ్మ, మెగులమ్మ తదితరులు పాల్గొన్నారు.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఓ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే వేడుకలు నిర్వహించగా.. మొయినాబాద్‌ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకొన్నారు. డ్రగ్‌ టెస్టు చేయగా.. ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి కనకమామిడి గ్రామ శివారులోని మ్యాంగో వుడ్‌ ఫామ్‌హౌస్‌, విల్లా నంబర్‌ 13లో కొంత మంది యువకులు గంజాయి వాడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే దాడులు జరిపి, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన బిషు కుమార్‌(25)కి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రాథమిక టెస్టులో నిర్ధారణ అయ్యింది. అతడిని ఠాణాకు తరలించి విచారించగా ఐదు నెలల క్రితం మనీష్‌ మొమోస్‌ అనే వ్యక్తి ద్వారా గంజాయి కొనుగోలు చేసి, వాడినట్లు వెల్లడించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement