శంషాబాద్: నాణ్యతలేని, అస్తవ్యస్త ఏర్పాట్లే నాదర్‌గుల్ ఎంవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన దుర్ఘటనకు కారణమని తేలింది. ఒక విద్యార్థిని మృతితో పాటు 22 మందికి గాయాలైన సంఘటనకు కారణమైన ముగ్గురిని ఆదిభట్ల పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్ వివరాలు వెల్లడించారు. కళాశాలలో మల్లెల సాకేత్ అనే వ్యక్తికి క్రియా ఆపరేషన్ పేరిట కళాశాల కో ఆర్డినేటర్లు బారికేడింగ్, ట్రస్, స్టేజ్, సౌండ్ సిస్టమ్, జనరేటర్, లైటింగ్ బాధ్యతలు అప్పగించారు. సాకేత్ వద్ద పూర్తి సామగ్రి లేకపోవడంతో అతడు వయోరా ఎక్స్‌పీరియన్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థకు సంబంధించిన తనుష్‌కు అప్పగించగా, అతడు మహేశ్ అనే మరో వ్యక్తికి అప్పగించాడు. మహేశ్ చివరికి పీఎస్ లైటింగ్ అండ్ సౌండ్ సంస్థకు చెందిన బత్తుల పునీత్, సాయం నిశాంత్ యాదవ్‌కు అప్పగించగా 16న తాత్కాలిక ట్రస్ ఏర్పాటు సమయంలో నాలుగు పిల్లర్లు వేయాల్సిన చోట కేవలం రెండు పిల్లర్లే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భద్రతా ఏర్పాట్ల జాగ్రత్తలను కూడా పాటించలేదు. వాతావరణ మార్పుల పరిస్థితులపై కూడా అంచనాలు లేకుండా నిర్మాణ స్థిరత్వం, భద్రతా అంశాలపై నిర్లక్ష్యం జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఈ నెల 17న రాత్రి దాండియా నృత్యం చేస్తున్నప్పుడు గాలితో కూడిన దుమ్మురావడంతో స్టేజీకి కుడివైపున విద్యార్థులు నృత్యం చేస్తున్న చోట తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇనుప ట్రస్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నారాయణదాస్ సోనా అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో 22 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
ముగ్గురి అరెస్ట్
ఈ ఘటనకు కారణమైన ఈవెంట్ ఏర్పాట్లు చేసిన మల్లెల సాకేత్, బత్తుల పునీత్, సాయం నిశాంత్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు ఈ ఘటనకు కారణమైన మరో ఇద్దరు నిర్వాహకులు తనుష్, మహేశ్‌తో పాటు కళాశాల కో ఆర్డినేటర్‌లు అఖిల్ ఖారే, రాజేశ్, హన్మంతు కులకర్ణీపై కూడా కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు కోసం ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఫైర్ డిపార్ట్‌మెంట్ వారి నుంచి కూడా నివేదికలను తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు డీసీపీ తెలిపారు.
నాలుగుకు బదులు రెండు పిల్లర్లే ఏర్పాటు చేసిన ఈవెంట్ నిర్వాహకులు
ఎంవీఎస్‌ఆర్ కళాశాల ఘటన వివరాలు వెల్లడించిన డీసీపీ రాజేశ్
ముగ్గురిని అరెస్ట్ చేసిన ఆదిభట్ల పోలీసులు


