● అక్రమంగా నిల్వ చేసిన రైస్ మిల్లుపై దాడులు
● ఓ లారీతో పాటు బియ్యం సంచులు సీజ్
● వ్యాపారులపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం రూరల్: ఓ రైస్ మిల్లుపై దాడి చేసిన సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... ఆదిభట్ల జీహెచ్ఎంసీ పరిధిలోని మంగళ్‌పల్లి రాఘవేంద్ర హోటల్ వెనకాల ఉన్న న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో భారీగా రేషన్ బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో టీఎస్ 03 యుబీ 3399 నంబరు లారీలో ఉన్న బియ్యంతో పాటు రైస్ మిల్లులో నిల్వ చేసిన మొత్తం 36 టన్నుల బియ్యాన్ని గుర్తించారు. వీటిని సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం, మోతే పరిఽధిలోని భారతి ఇండస్ట్రీస్ నుంచి కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. అమ్మిన, కొన్న వారిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ నర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


