కాలిబూడిదైన సామగ్రి
● భారీగా ఆస్తి నష్టం
● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న
పోలీసులు
పహాడీషరీఫ్: ప్టాస్టిక్ కుర్చీల తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి గ్రామంలోని ఊరగుట్టలో అత్తాపూర్‌కు చెందిన దీపేష్ మెహతాకు చెందిన ‘పవన్ ప్లాస్టో క్రాఫ్ట్’ కంపెనీలో ప్లాస్టిక్ కుర్చీలతో పాటు ఫంక్షన్ హాళ్లలో వినియోగించే స్టీల్ చైర్లు, ఇతర ప్లాస్టిక్ సామగ్రిని తయారు చేస్తుంటారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.30 గంటలకు ఒక్కసారిగా కంపెనీలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మయ్య అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రెండు ఫైరింజన్లతో వచ్చిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైడ్రా బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ కంపెనీలోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. ఆస్తి నష్టం పెద్ద మొత్తంలో ఉంటుందని తెలుస్తోంది. మంటల ధాటికి షెడ్డుతో పాటు గోడలు సైతం ధ్వంసమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందా, మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
దట్టంగా అలుముకున్న పొగలు
అగ్ని ప్రమాదంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దట్టమైన పొగలతో సమీపానే ఉన్న గ్రామ ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. జల్‌పల్లి సర్కిల్ పరిధిలోకే వచ్చే రాయల్ కాలనీలో రెండు రోజుల క్రితం స్క్రాప్ గోదాంలో జరిగిన ఘటన మరువక ముందే తాజాగా జల్‌పల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఇలాంటి కంపెనీల పట్ల జీహెచ్‌ఎంసీ, పీసీబీ అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.


