కీలక అడుగు | - | Sakshi
Sakshi News home page

కీలక అడుగు

Jul 30 2026 7:18 AM | Updated on Jul 30 2026 7:18 AM

క్రీడాభివృద్ధికి

మొయినాబాద్‌ మున్సిపల్‌ ప్రాంతంలో స్పోర్ట్స్‌ హబ్‌ ఏర్పాటుకు ముందడుగు పడింది. క్రీడాకారులకు ఆధునిక సౌకర్యాలతో పాటు క్రీడాపోటీలు నిర్వహించేలా మినీ స్టేడియం అభివృద్ధి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మొయినాబాద్‌: పదిహేడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న మినీ స్టేడియం ఇక స్పోర్ట్స్‌ హబ్‌గా మారనుంది. ఈ స్టేడియాన్ని రూ.20 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌(యూసీఎఫ్‌)తో పాటు మున్సిపల్‌ నిధులు, బ్యాంకు లోన్‌ లేదా దాతల సహకారంతో ఏర్పాటు చేసేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

అన్ని క్రీడలకు ఒకే ప్రాంగణం

మొయినాబాద్‌ మున్సిపాలిటీలో స్పోర్ట్స్‌ స్టేడియం ఏర్పాటుకు అధికారులు సంకల్పించారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల క్రీడలకు ఉపయోగపడేలా స్పోర్ట్స్‌ హబ్‌ నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఇందుకు మున్సిపల్‌ పరిధి పెద్దమంగళారం రెవెన్యూ సర్వే నంబర్‌ 359లో నాలుగు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ ఇప్పటికే మినీ స్టేడియం ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం ఆ స్థలాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా అభివృద్ధి చేసే ఆలోచనతో మున్సిపల్‌ అధికారులు ముందుకు వెళ్తున్నారు.

పదిహేడేళ్లుగా నిరుపయోగం

పదిహేడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మినీ స్టేడియం ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. 2009లో అప్పటి ప్రభుత్వం మినీ స్టేడియం ఏర్పాటుకు పెద్దమంగళారం రెవెన్యూ సర్వే నంబర్‌ 359లో నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.40 లక్షల నిధులు మంజూరు చేసింది. అప్పట్లో స్టేడియం చుట్టూ ప్రహారీ నిర్మించి.. స్థలాన్ని చదును చేశారు. ఈ మినీ స్టేడియం ఏ గ్రామానికి దగ్గరగా లేక, సౌకర్యాల లేమితో క్రీడాకారులెవరూ అక్కడికి వెళ్లలేదు. దీంతో ఇంతకాలం నిరుపయోగంగానే ఉండిపోయింది.

స్థల పరిశీలన పూర్తి

స్పోర్ట్స్‌ హబ్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ, బ్యాంకులోన్‌ లేదా స్పాన్సర్స్‌ భాగస్వామ్యం కానున్నారు. రూ.20 కోట్ల నిధుల్లో కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్‌ నుంచి రూ.5 కోట్లు, మున్సిపల్‌ నిధుల నుంచి రూ.5 కోట్ల కేటాయించనున్నారు. మరో రూ.10 కోట్ల నిధులను బ్యాంక్‌ లోన్‌ లేదంటే దాతల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఇటీవల మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, డీఈ చిరంజీవులు పెద్దమంగళారంలోని మినీ స్టేడియం స్థలాన్ని పరిశీలించారు. మొత్తం రూ.20 కోట్లతో స్పోర్ట్స్‌ స్టేడియంను నిర్మించేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి స్పోర్ట్స్‌ అథారిటీకి పంపించారు.

ప్రైవేట్‌కు దీటుగా స్టేడియం నిర్మాణం

స్పోర్ట్స్‌ స్టేడియంలో వివిధ రకాల ఆటలకోసం ప్రత్యేకమైన గ్రౌండ్‌లు ఏర్పాటు చేయనున్నారు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ కోర్టులు, స్విమ్మింగ్‌ ఫూల్‌తోపాటు అథ్లెటిక్స్‌కు సంబంధించిన గ్రౌండ్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నగర శివారుల్లో ప్రైవేటు గ్రౌండ్‌లు, స్టేడియాలు అధికంగా రావడంతో వాటికి దీటుగా ప్రభుత్వమే క్రీడాకారులకు స్పోర్ట్స్‌ స్టేడియం అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

స్పోర్ట్స్‌ హబ్‌గా మారనున్న మినీస్టేడియం

రూ.20 కోట్లతో అభివృద్ధి చేసే యోచన

ప్రతిపాదనలు సిద్ధం చేసిన మున్సిపల్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement