బీఆర్‌ఎస్‌లో ఆశావహుల పోటీ | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో ఆశావహుల పోటీ

Jul 30 2026 7:18 AM | Updated on Jul 30 2026 7:18 AM

ఇతర పార్టీల్లో ఇద్దరు

మున్సిపల్‌ అధ్యక్ష పదవికి హోరాహోరీ

తెరపైకి సామాజిక సమీకరణలు

మొయినాబాద్‌: బీఆర్‌ఎస్‌లో అధ్యక్ష పదవికి నాయకుల మధ్య పోటీ పెరిగింది. సామాజిక సమీకరణలను తెరపైకి తెస్తూ ఎవరికి వారే అధ్యక్ష పదవి తమకు కావాలంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలు ఎవరూ లేకపోవడంతో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్ని తానై చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మొయినాబాద్‌ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే విషయం ఇప్పుడు ఆమెకు కత్తిమీద సాముగా మారింది.

పెద్దలపై ఒత్తిడి

మొయినాబాద్‌లో బీఆర్‌ఎస్‌ బలంగా ఉండటంతో పార్టీ అధ్యక్ష పదవికి డిమాండ్‌ పెరిగింది. గతంలో బీఆర్‌ఎస్‌ మొయినాబాద్‌ మండల అధ్యక్ష పదవిని మూడు పర్యాయాలుగా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తూ వచ్చింది. ఏడాదిన్నర క్రితం మొయినాబాద్‌ మున్సిపాలిటీ ఏర్పాటు కావడంతో అప్పటి నుంచి మున్సిపాలిటీకి అధ్యక్షుడిని నియమించాలని పార్టీ నాయకులు అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. కానీ కొంత కాలం క్రితం మున్సిపల్‌, మండలం మొత్తానికి దారెడ్డి వెంకట్‌రెడ్డి ఒక్కరినే అధ్యక్షుడిగా నియమించారు.

తెరపైకి సామాజిక సమీకరణలు

బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నాయకులంతా సామాజిక సమీకరణలను తెరపైకి తెస్తున్నారు. పార్టీ మండల అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గం నాయకుడు పదవిలో ఉండటంతో మున్సిపాలిటీలో ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గం నాయకులకు అధ్యక్ష పదవిని ఇవ్వాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. అయితే మున్సిపల్‌ అధ్యక్ష పదవిని అన్ని సామాజిక వర్గాల నేతలు ఆశిస్తున్నారు. అజీజ్‌నగర్‌ ఎంపీటీసీ మాజీ సభ్యుడు కొత్త మాణిక్‌రెడ్డి ముందు నుంచే మున్సిపల్‌ అధ్యక్ష పదవిని ఆశిస్తుండగా పెద్దమంగళారం మాజీ సర్పంచ్‌ కోట్ల నరోత్తంరెడ్డి సైతం అధ్యక్ష పదవికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన హిమాయత్‌నగర్‌ మాజీ సర్పంచ్‌ ముదిగొండ శ్రీహరి యాదవ్‌, అదే గ్రామానికి చెందిన మరో నాయకుడు ముదిగొండ రవియాదవ్‌, మొయినాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు సురేందర్‌గౌడ్‌, చిలుకూరు మాజీ ఉప సర్పంచ్‌ సిద్ధాంతి నర్సింహగౌడ్‌ మున్సిపల్‌ అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ డప్పు రాజు, చిలుకూరుకు చెందిన జయవంత్‌ మున్సిపల్‌ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. మైనార్టీ సామాజిక వర్గం నుంచి మొయినాబాద్‌కు చెందిన ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ రవుఫ్‌ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మున్సిపల్‌ అధ్యక్ష పదవికోసం ఇంత మంది పోటీ పడుతుండడంతో ఎంపిక విషయం సబితారెడ్డికి తలనొప్పిగా మారింది. దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. ఎవరిని అధ్యక్ష పదవి వరిస్తుందో వేచి చూడాలి.

ప్రధాన రాజకీయ పార్టీలు మండలం, మున్సిపాలిటీకి వేర్వేరుగా అధ్యక్షులను నియమించాయి. బీజేపీ ఏడాది క్రితమే ఇద్దరు అధ్యక్షులను నియమించగా.. కాంగ్రెస్‌ ఇటీవలే మండలం, మున్సిపాలిటీకి వేర్వేరుగా ఇద్దరు అధ్యక్షులను నియమించింది. దీంతో బీఆర్‌ఎస్‌లోనూ మున్సిపల్‌ అధ్యక్షుడిని నియమించాలనే డిమాండ్‌ పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement