తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో వయసు పైబడి చావుకు దగ్గరగా ఉన్న, వ్యాధులు సోకిన జీవాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. తాజాగా మంగళ్‌హాట్ పరిధిలోని చిస్తీచమాన్‌దర్గా సమీపంలోని ఓ వ్యక్తి నుంచి 300 కిలోల కుళ్లిన మాంసాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ జిల్లాల్లో అధికారికంగా 7 వేలకుపైగా మాంసం విక్రయ కేంద్రాలు ఉండగా, అనధికారికంగా 30 వేల వరకు ఉన్నట్లు అంచనా. గత ఏడాది ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనీఖీలు నిర్వహించగా 5,730 విక్రయ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. మెజార్టీ కేంద్రాల్లో శుభ్రత లోపం, స్టాంపు లేని గొర్రెలు, మేకలు కోసి అమ్ముతుండటాన్ని గుర్తించారు.
ఈరోజు కాదంటే.. మరుసటి రోజు
నిజానికి ఏదైనా మేక, గొర్రె, కోడి కోసే ముందు పశువైద్యుడు క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. కానీ 99 శాతం మాంసం వ్యాపారుల వద్ద ఇవేవీ ఉండటం లేదు. గొర్రెలు, మేకల మాంసంలో పశువుల మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి గొర్రెను కోసిన తర్వాత సాధారణ వాతావరణంలో నిల్వ ఉంచితే త్వరగా పాడవుతుంది. మెజార్టీ మాంసం విక్రయ దుఖాణాల్లో రోజంతా రోడ్డు పక్కన ఓ తాడుకు వేలాడదీసి ఉంచుతున్నారు. ఈ రోజు కోసింది అమ్ముడు పోకపోతే.. దాన్ని మరుసటి రోజు అమ్ముతున్నారు. అప్పటికే అందులో అనేక రకాల బ్యాక్టీరియా చేరుతోంది. కుళ్లిన మాంసంతో కలర్‌ఫుల్ బిర్యానీ, ఫ్రై వంటకాలు తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలియక చాలామంది మాంసం ప్రియులు ఆరగించేస్తున్నారు చివరకు అనారోగ్యానికి గురవుతున్నారు. తాము కొన్న మాంసంపై ఏదైనా అనుమానం ఉంటే పరీక్ష కోసం చంగిచర్లలోని జాతీయ మాంసం పరిశోధన మండలి (ఎన్‌ఆర్‌సీఎం)ని సంప్రదించొచ్చు.
యథేచ్ఛగా నాసిరకం, కుళ్లిన మాంసం విక్రయాలు
తాజాగా మంగళ్‌హాట్‌లో 300 కిలోల పట్టివేత
వ్యాధులు సోకిన జీవాలను కోసి అమ్ముతున్న వైనం
రోగాలు తప్పవంటున్న వైద్య నిపుణులు
తలసరి మాంసం వినియోగం ఇలా
గొర్రె మాంసం 4.02 కేజీలు
మేక మాంసం 0.950 కేజీలు
చికెన్ 3.5 కేజీలు
ఇతర జంతువుల మాంసం 0.73 కేజీలు
మొత్తం 9.2 కేజీలు


