ఇబ్రహీంపట్నం: గ్యాస్ సంక్షోభం ఇటు వ్యాపార, అటు గృహ వినియోగదారులను పట్టి పీడిస్తోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో తలెత్తిన సమస్య అన్నివర్గాల ప్రజలను, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. డివిజన్ పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, ఉన్నత విద్యాలయాలు, హాస్టల్స్ ఉన్నాయి. టీ, టిఫిన్ సెంటర్స్, హోటళ్లు, బేకరీలు, కర్రీ పాయింట్లు, పెద్ద సంఖ్యలో వెలిసాయి. వారం రోజులుగా గ్యాస్ కొరత నెలకొనడంతో వారి వ్యాపారం దెబ్బతింటోంది. కమర్షియల్ సిలిండర్లను నిలిపివేయడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. రోజుకు మూడు, నాలుగు సిలిండర్లు అవసరమయ్యే వ్యాపారులకు ఏం చేయాలో తోచడం లేదు. చేసేది లేక కట్టెల పొయ్యిలు పెట్టి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. హోటల్స్‌ను మూసివేస్తే భవనాల రెంట్, పనిచేసే సిబ్బంది జీతభత్యాలు భారంగా మారనున్నాయి. వివిధ హాస్టళ్లలో గ్యాస్ నిల్వలు నిండుకుంటుండడంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అవకాశం ఉన్న వ్యాపారులు కట్టెల పొయ్యిలవైపు దృష్టి సారిస్తున్నారు.
గ్యాస్ బుకింగ్ కాక అగచాట్లు
వంట గ్యాస్ కొరతతో సామాన్యులు సతమతమవుతున్నారు. రోజురోజుకూ సమస్య జఠిలంగా మారుతోంది. వారం రోజులుగా గృహ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నా డీలర్ పాయింట్ నుంచి రెస్పాన్స్ రావడం లేదు.
వాణిజ్య సిలిండర్‌కు గండం
హోటళ్లు, బేకరీలు, కర్రీ పాయింట్లు, హాస్టళ్లపై ప్రభావం
ఆందోళనలో వ్యాపారులు, నిర్వాహకులు
గృహ వినియోగదారులకూ తప్పని అవస్థలు
కట్టెల పొయ్యిలపై వంటకాలు


