చేవెళ్ల: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోతుగల్ గేట్ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోతుగల్ గ్రామానికి చెందిన యాదయ్య(55) ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఎప్పటి మాదిరిగానే పనికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో పోతుగల్ గేట్ వద్ద రోడ్డును దాటుతుండగా వేగంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తమ్ముడు రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గాలికుంటు టీకాలు తప్పనిసరి
కడ్తాల్: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా పాడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి(డీవీఎహెచ్‌ఓ) డాక్టర్ శ్రీనివాస్‌రావు అన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడ్‌తండాలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని సర్పంచ్ శారదబిక్కునాయక్‌తో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు గాలికుంటు వ్యాధికి సంబంధించి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ఈ మేరకు వైద్య సిబ్బంది 485 పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి భానునాయక్, జేవీఓలు వెంకటయ్య, మల్లేశ్, రాజేశ్, వైద్య సిబ్బంది రైతులు ఉన్నారు.


