చర్యలు తీసుకుంటాం
వికారాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ మూతపడింది. ఎనిమిది నెలలు కావస్తున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ సగటున ఐదు నుంచి ఎనిమిది యూనిట్లు బ్లడ్ అవసరం. ఈ లెక్కన నెలకు 150 నుంచి 200 వరకు యూనిట్లు కావాలి. ఇంత పెద్ద మొత్తంలో రక్తం అవసరమున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. బ్లడ్ అవసరమైన ప్రతిసారీ పరిగి లేదా తాండూరుకు పరుగులు తీయాల్సి వస్తోంది. సమస్యను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. డయాలసిస్ సెంటర్‌లో కిడ్నీ పేషెంట్లు రక్తం దొరక్క అవస్థలు పడుతున్నారు. జిల్లాలో చాలా మంది గర్భిణులు రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రసవ సమయంలో రక్తం దొరకడం లేదు. రక్తం నిల్వలపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు పట్టించుకోవడంలేదు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్‌ల ఇష్టారాజ్యం
జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ సేవలు నిలిచి పోవడం.. ఇదే క్రమంలో స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటుపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇందు కోసం వేలకు వేలు వెచ్చించాల్సి వస్తోంది. వికారాబాద్‌లో రెండు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఉండగా వాటిపై అధికారుల నియంత్రణ పూర్తిగా కరువైంది. నిర్వాహకులు డిమాండ్‌ను బట్టి అధిక ధరలకు బ్లడ్ విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉచితంగా బ్లడ్ ఇస్తారు. ఒక వేళ ప్రైవేటు ఆస్పత్రుల్లోని రోగులకు కావాల్సి వస్తే ఒక్కో యూనిట్ రూ.1,050 విక్రయిస్తారు. ప్రైవేటులో అయితే పెషెంట్ల అవసరాన్ని బట్టి ఒక్కో యూనిట్‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే 50 కిలోమీటర్ల దూరంలోని తాండూరు జనరల్ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. మూడు నెలల క్రితం జరిగిన టిప్పర్ – బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో వికారాబాద్ జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా మంగళవారం కలెక్టరేట్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు ఉద్యోగులు రక్త దానం చేశారు.
బ్లడ్ బ్యాంక్‌లో విధులు నిర్వహించే వైద్యులు, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర కింది స్థాయి సిబ్బంది పది మంది వరకు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది నిర్వాకం కారణంగా పలు పరికరాలు పాడైనట్లు తెలిసింది. జనరల్ ఆస్పత్రిని పాత భవనం నుంచి కొత్త బిల్డింగ్‌లోకి మార్చే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో చాలావరకు పాడైనట్లు సమాచారం. రక్త నిధి కేంద్రం అందుబాటులోకి రావాలంటే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో సమస్యను కలెక్టర్‌కు విన్నవించినట్లు తెలుస్తోంది.
జిల్లా జనరల్ ఆస్పత్రిలో మూతబడిన బ్లడ్ బ్యాంక్
ఎనిమిక్ గర్భిణులు, డయాలసిస్ పేషెంట్ల అవస్థలు
అత్యవసర సమయాల్లో తాండూరుకు వెళ్లాల్సిందే..
ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి
ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్న ప్రైవేట్ నిర్వాహకులు
పట్టించుకోని అధికారులు, పాలకులు
బ్లడ్ బ్యాంక్ పరికరాలు పాడైన విషయాన్ని గత కలెక్టర్‌కు విన్నవించాం. ఏ మేరకు నిధులు అవసరమో అంచనాలు పంపమన్నారు. ఈ లోగా ఆయన బదిలీ అయ్యారు. ప్రస్తుత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. నెల రోజుల్లో బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– రాజ్యలక్ష్మి, జనరల్ ఆస్పత్రి సూపరింటిండెంట్


