● అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
● సీపీఐ నాయకుల డిమాండ్
● కలెక్టర్ దీపక్ తివారికి ఫిర్యాదు
వికారాబాద్: జిల్లా కేంద్రంలోని మహవీర్ ఆస్పత్రిలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి యాజమాణ్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ దీపక్ తివారిని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్, నియోజకవర్గ కార్యదర్శి మల్లేశ్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహవీర్ ఆస్పత్రిలో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ లేదని తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆస్పత్రిపై నమ్మకం సన్నగిల్లి రోగులు కూడా రావడం లేదన్నారు. మూడు వందల మంది ఫ్యాకల్టీ ఉండాల్సిన చోట 50 మంది కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. కర్ణాటకకు చెందిన వారు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నట్లు తెలిపారు. కొందరు ఉద్యోగులు విద్యార్థుల పట్ట అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. కళాశాల విషయాలు బయట చెబితే మీరు ఎలా పాస్ అవుతారో చూస్తామని కొందరు బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఇన్‌స్పెక్షన్ జరిగే సమయంలో డబ్బు ఇచ్చి రోగులను ఆస్పత్రికి రప్పిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిని విక్రయించేందుకు నిర్ణయించిన యాజమాన్యం విద్యార్థులు, రోగులతో చలగాటమాడుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు.
సమయాన్ని వృథా చేసుకోవద్దు
● పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి
కొడంగల్ రూరల్: విద్యార్థులు లక్ష్యం దిశగా చదువుతూ ఉన్నత స్థానాల్లో నిలవాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీ బాలాజీ కేజీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు అందించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, సమయాన్ని వృథా చేసుకోరాదని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తూ పాఠశాల పేరు నిలబెట్టాలని కోరారు. తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, హెచ్‌ఎం వెంకటప్ప, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ధారూరు: వ్యవసాయ విస్తరణ అధికారుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా సంజూ రాథోడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం వికారాబాద్‌లో వ్యవసాయ విస్తరణ అధికారులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీపతి రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా పెంటయ్య, కోశాధికారిగా విశ్వనాథ్‌ను ఎన్నుకున్నారు.


