తుర్కయంజాల్: వందేళ్లుగా తమ కుటుంబం సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం లాక్కుని, ఉపాధిని దూరం చేస్తుందని ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధి కొహెడకు చెందిన రైతు బుడ్డ ఆగమయ్య ఆరోపించారు. మంగళవారం రైతు పొలం వద్ద ఏర్పాటు చేసిన నిరసనలో కొహెడ జేఏసీ నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆగమయ్య మాట్లాడుతూ.. సర్వే నంబర్ 167/1లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణం కోసం 4 ఎకరాల ప్రభుత్వ భూమిని అధీనంలోకి తీసుకున్న ప్రభుత్వం.. అందులోని సొప్ప, జొన్న చేనును రాత్రిపూట పూర్తిగా ఽతొలగించారని ఆరోపించారు. జేఏసీ నాయకుడు కందాల బల్‌దేవ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితులు, బీసీ, ఎస్టీల భూములు మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడానికి కనిపిస్తున్నాయని చెప్పారు. కనీసం తినడానికి తిండిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు చెందిన రైతుల భూములను లాక్కోవడం దారుణమని, రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండా భూములను లాక్కుంటే చూస్తూ ఊరకోమని హెచ్చరించారు. ఇదే సర్వే నంబర్‌లోని 266 ఎకరాల ఏక్‌సాల్ పట్టాలను కలిగిన రైతుల భూములను కూడా ఎలాంటి పరిహారం అందించకుండా తీసుకుందామనే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడంతో పాటు, అభివృద్ధి చేసిన లే అవుట్‌లో ఎకరానికి 500 గజాల ప్లాట్‌లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కంబాలపల్లి ధన్‌రాజ్, బాల్‌రాజ్‌తో పాటు, పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొహెడ జేఏసీ నేత బల్‌దేవ్‌రెడ్డి


