ఇబ్రహీంపట్నం: గ్రామాల్లో నెలకొన్న ప్రజాసమస్యలను పరిష్కరించాలని చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, ఉపాధి హామీ, ఇతర సమస్యలను ఈ నెల 20 వరకు గుర్తిస్తామన్నారు. అనంతరం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆయా సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో రాస్తారోకోలు, ధర్నాలు తదితర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సామేల్, జంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, బుగ్గరాములు, నర్సింహ, జగన్, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఐక్య పోరాటాలు చేయాలి
మంచాల: ఉపాధిహామీ పథకం చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తిప్పాయిగూడలో ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలను కలిశారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు గడ్డపారలు ఇవ్వాలన్నారు. మెడికల్‌కిట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని నీరుగార్చేందుకు పావులు కదుపుతోందని ఆరోపించారు. కార్మికులు, కర్షకులు ఐక్యతతో కేంద్రప్రభుత్వ మెడలు వంచాలన్నారు. అందుకోసం ఐక్య పోరాటాలు చేయడం అవసరమన్నారు. కార్మికుల హక్కుల కోసం సీపీఎం ముందుండి పోరాడుతుందన్నారు. కార్మికులు, కర్షకుల సమస్యలపై భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జంగయ్య, మండల కమిటీ సభ్యులు యాదయ్య, నాయకులు సుధాకర్, ప్రభాకర్, యాదయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య


