కొందుర్గు: మండలకేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం–1లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలండర్ లీకవడంతో మంటలు చెలరేగాయి. వివారాలు.. ఉదయం 10 గంటల సమయంలో అంగన్‌వాడీ ఆయా రమాదేవి విద్యార్థులకు వంటచే క్రమంలో స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా పెద్దగా మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అంగన్‌వాడీ టీచర్ శ్రీలత, ఆయా రమాదేవి కేంద్రంలో ఉన్న 18 మంది చిన్నారులను బయటికు తరలించారు. అనంతరం స్టవ్ ఆపే ప్రయత్నం చేశారు. స్థానికులు ఇనుపకడ్డీ సాయంతో గ్యాస్ సిలిండర్‌ను బయటికి తీశారు. మంటలార్పేందుకు పెట్రోల్ బంక్‌లలో అగ్నిప్రమాద నివారణ యంత్రం కోసం యత్నించగా లభించలేదు. స్థానికులు, పోలీసుల సాయంతో గోనెసంచులు కప్పి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ ఉదయ, సూపర్‌వైజర్ జ్యోత్స్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అన్ని కేంద్రాల్లో గ్యాస్ పైపులు, సిలిండర్లు నాణ్యత పరిశీలించి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని సీడీపీఓ ఉదయ సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రంలో తప్పిన ముప్పు


