‘పీఠ’ముడి! | - | Sakshi
Sakshi News home page

‘పీఠ’ముడి!

Feb 18 2026 8:32 AM | Updated on Feb 18 2026 8:32 AM

‘పీఠ’

‘పీఠ’ముడి!

‘పట్నం’ ఎన్నికపై స్టే విధించిన హైకోర్టు

ఇబ్రహీంపట్నం: ‘పట్నం’ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.. అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 13 స్థానాలు గెలిచి మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినా పీఠం దక్కకుండా అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ డ్రామాలకు తెరలేపింది. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఆకుల యాదగిరిని కిడ్నాప్‌ చేశారంటూ అతని కుటుంబసభ్యుల ఆరోపణలు, ఫిర్యాదులు.. వారికి మద్దతుగా కాంగ్రెస్‌ కౌన్సిలర్ల ఆందోళనలతో సోమవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడ్డ విషయం విధితమే. మంగళవారం తిరిగి జరిగిన సమావేశంలో న్యాయస్థానం స్టే ఇచ్చిందని ఎన్నికను నిలిపివేశారు. పోలీసులు విధించిన ఆంక్షలను లెక్క చెయకుండా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దసంఖ్యలో గూమిగూడడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వారిద్దరి మధ్య ఆధిపత్యపోరు

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య ఆది నుంచీ రాజకీయంగా అధిపత్యపోరు కొనసాగుతోంది. మెజార్టీ తమకే దక్కిందని పీఠాన్ని అధిష్టించి తీరుతామని కిషన్‌రెడ్డి సవాల్‌ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు దక్కకుండా కాంగ్రెస్‌ పావులు కదుపుతుండటంతో ఆధిపత్యపోరు మరోసారి బహిర్గతమైంది. ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో అంతుచిక్కడంలేదు.

ప్రజల్లో భిన్నాభిప్రాయాలు

మున్సిపాలిటీలో నెలకొన్న పరిణామాలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెజర్టీ స్థానాలు దక్కిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు అడ్డుపడటం సరైన ధోరణి కాదని కొందరు అంటుండగా, మరి కొందరు రాజకీయ పోరులో ఇవన్నీ సహజమేనని కొట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం ఈ రాజకీయ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

పోలీసు పహారాలోనే..

రెండు రోజులుగా ఇబ్రహీంపట్నం పోలీసుల పహారాలోనే ఉంది. పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు సుమారు 600 మంది సిబ్బంది బందోబస్తులో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రాజకీయ ఎత్తుగడల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఆంక్షలు విధించినా వాటిని ఖాతర్‌ చేయడం లేదు. ఇరు పార్టీల నాయకులు మున్సిపల్‌ కార్యాలయం వద్దకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. మరోవైపు వరుస ఆందోళనలతో పలు వ్యాపార సంస్థలను మూసివేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్‌ పీఠం చిక్కుముడి వీడేంత వరకు ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు తప్పేలా లేవు.

ప్రజా తీర్పును గౌరవించాల్సిందే..

అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా అంటూ కాంగ్రెస్‌పై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో కూర్చొని మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియపై ఆరా తీశారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసులు, అధికారులను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయలేరన్నారు. ప్రజలిచ్చిన తీర్పును అగౌరవపరిస్తే ప్రజాస్వామ్యాన్ని అపహ్యసం చేసినట్లేనన్నారు. బీఆర్‌ఎస్‌కు మెజార్టీ కౌన్సిలర్లున్నా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగకుండా అడ్డుపడడాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. తగిన రీతిలో బుద్ధిచెబుతారన్నారు. సబితారెడ్డితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎత్తుకు పైఎత్తులు

రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయాలు

రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు

‘పీఠ’ముడి!1
1/2

‘పీఠ’ముడి!

‘పీఠ’ముడి!2
2/2

‘పీఠ’ముడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement