పురపాలిక.. ప్రగతి వీచిక
చైర్మన్ విధులు ఇలా..
సంధానకర్తగా కౌన్సిలర్
షాద్‌నగర్: పురపాలిక ఎన్నికల్లో గెలుపొంది కౌన్సిలర్‌గా, చైర్మన్‌గా ఎన్నికయ్యే వారికి అనేక అధికారాలు, విధులను మున్సిపల్ చట్టం కల్పించింది. దీని ద్వారా పాలక మండలి సభ్యులు పురపాలక అభివృద్ధికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నిబంధనలు అతిక్రమించే సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంటుంది. పాలక వర్గం ఏర్పాటైన తర్వాత ప్రతీ నెల విధిగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలి. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి కొత్త పనులు చేపట్టేందుకు తీర్మానాలు చేయాలి.
ఇవీ పాలకమండలి విధులు
● పురపాలక చైర్మన్ అధ్యక్షతన పాలక వర్గాల సమావేశాలు జరుగుతాయి. పురపాలక చట్టం ప్రకారం చైర్మన్ అధికారాలు వినియోగించుకోవచ్చు.
● పాలక వర్గం, ప్రభుత్వం, అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు మున్సిపల్ చైర్మన్ పేరుతో జరుగుతాయి. కౌన్సిల్ ఆమోదం లేకుండా అత్యవసర పనులకు అనుమతులు మంజూరు చేసే అధికారం ఉంటుంది. తర్వాత ఆ పనులకు సంబంధించిన వివరాలను పాలక వర్గం సమావేశంలో ఉంచి తీర్మానం చేయాల్సి ఉంటుంది.
● చైర్మన్ వరుసగా పది రోజుల కంటే ఎక్కువ అధికార క్షేత్రం నుంచి గైర్హాజరైతే వైస్ చైర్మన్‌కు అధికారాలు అప్పగిస్తారు. రాష్ట్రం పరిధిలోనే ఉంటే మాత్రం లభించవు.
● ప్రతీ నెల నిర్వహించే సమావేశానికి మున్సిపల్ చైర్మన్ ఏదేని కారణం చేత హాజరు కాకపోతే వైస్ చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. సభ్యులు వరుసగా మూడుసార్లు పాలక వర్గం సమావేశానికి హాజరు కాకపోతే కౌన్సిలర్‌గా అర్హత కోల్పోతారు.
● అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపుపై పాలకవర్గం సమావేశంలో చర్చించి మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీర్మానాలు చేస్తారు. సభ్యులకు ఇష్టం లేకుంటే తీర్మానంపై డీసెంట్ నోటీసు ఇచ్చే అవకాశం కౌన్సిలర్లకు చట్టం కల్పించింది.
● పాలకవర్గం ఆదేశాలకు విరుద్ధంగా పని చేసిన అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపించే అఽధికారం పాలక వర్గానికి ఉంటుంది.
కమిషనర్ల విధులు, బాధ్యతలు
● ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం.
● ప్రజలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేయడం, శానిటేషన్ పనులు, సమర్థవంతంగా వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహించాల్సి ఉంటుంది.
● ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేలా చూడడం, రోడ్లు, వీధులను పరిశుభ్రంగా ఉంచేలా చూడడం.
● సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం, మురికి వాడల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, శ్మశానవాటికలు నిర్మించడం.
● వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవడం.
● పట్టణంలో పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయడం, రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేయడం.
● ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేపట్టే ప్రాధాన్యతా కార్యక్రమాలను అమలు చేయడం.
● కమిషనర్లు, పురపాలక సంఘం ఉద్యోగులు, కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పని చేయాల్సి ఉంటుంది.
ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా మున్సిపల్ కౌన్సిల్
అభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం
అధికారాలతోపాటు బాధ్యతలూ నిర్వర్తించాలి
నిబంధనలు పాటించకుంటే చట్టం ప్రకారం చర్యలు
పురపాలికలో జరిగే పాలనపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించొచ్చు.
అధికారుల పనితీరు, కార్యాలయ నిర్వహణ, అభివృద్ధి పనులపై తనిఖీ చేయొచ్చు.
అధికారులపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవచ్చు.
ప్రభుత్వం మంజూరు చేసే నిధుల కేటాయింపు, బడ్జెట్ రూపకల్పన, ప్రజలకు అవసరమైన మౌళిక సౌకర్యాలకు ప్రాధాన్యం కల్పించే అధికారం, బాధ్యత ఉంటుంది.
అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి పనులు, కార్యక్రమాలపై తీర్మానాలు చేసే అధికారం ఉంటుంది.
పురపాలక సంఘం పరిధిలో జరిగే ప్రతి అంశంపై సమీక్ష నిర్వహించే అధికారం ఉంటుంది.
కౌన్సిలర్‌గా ఎన్నికయ్యే వారు ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటిని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలి.
కాలనీల్లో ఉన్న పార్కుల అభివృద్ధి, తాగునీటి సంరక్షణ చర్యలు, ప్రభుత్వ స్థలాలను కాపాడడం, మున్సిపల్ ఆస్తులపై దురాక్రమణలు తొలగించడం ప్రజాప్రతిఽనిధుల బాధ్యత.
వర్షపు నీటి సంరక్షణ చర్యలు పురపాలక చైర్మన్లు చేపట్టాల్సి ఉంటుంది.
ప్రాధాన్యం ప్రకారం చేపట్టాల్సిన పనులను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసేలా కౌన్సిలర్లు కృషి చేయాలి.
కొత్త మున్సిపల్ చట్టంలో ప్రజాప్రతినిధులకు విధులు, బాధ్యతలను పొందుపర్చారు. కాలనీల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాల సక్రమ నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి పనులు సక్రమంగా చేపట్టాలి.
వార్డుల్లో తాగునీటి సరఫరా, మురుగు కాల్వల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం వంటి పనులపై కౌన్సిలర్ ప్రతిరోజు పరిశీలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.


