‘పట్టా’.. ఎలాగైంది ఇట్టా!
కందుకూరు: ఓ వ్యక్తి తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో హెచ్‌ఎండీఏ అనుమతులతో ఏర్పాటు చేసిన వెంచర్‌లో ప్లాటు కొన్నాడు హెచ్‌ఎండీఏ వెంచర్‌లో అయితే అన్నీ సక్రమంగా ఉంటాయని, ఎలాంటి సమస్య ఉండదన్న ఉద్దేశంతో కొనుగోలు చేశాడు. ఇటీవల అవసర నిమిత్తం విక్రయించాలని చూస్తే ఆ వెంచర్‌లోని సర్వే నంబర్ ప్రభుత్వ భూమిగా నమోదైంది. దీంతో హతాశుడయ్యాడు. అతనొక్కడే కాదు భూములు ఉన్నాయనే భరోసాతో ఉన్న చాలా మందికి ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. అధికారుల తప్పిదంతో పట్టా భూములు ప్రభుత్వ, భూదాన్ భూములుగా మారిపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.
నిషేధిత జాబితాలో నమోదు
ఇటీవల కొత్తగా తయారు చేసిన ప్రభుత్వ, భూదాన్, సీలింగ్ భూముల వివరాలను ప్రభుత్వం నిషేధిత జాబితా 22ఎలో ఉంచింది. అన్ని సరిగాఉన్నాయో లేదో చూసుకోకుండానే పబ్లిక్ డొమెన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులో అందుబాటులో ఉంచింది. ఆ జాబితా చూసుకున్న చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వారసత్వంగా వచ్చిన భూములు సాగు చేసుకుంటున్న వారితో పాటు అన్నీ చూసుకుని భూమిని కొనుగోలు చేసిన వారు ప్రభుత్వం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన జాబితాలో సర్వే నంబర్లు ప్రభుత్వ, భూదాన్‌గా నమోదవడం చూసి హతాశులవుతున్నారు.
మచ్చుకు కొన్ని...
కందుకూరు సర్వే నంబర్ 518లో హెచ్‌ఎండీఏ అనుమతులతో ఎల్‌పీ నంబర్ 2018లో తీసుకుని లేఅవుట్ అభివృద్ధి చేసి ప్లాట్లు విక్రయించారు. ఆ నంబర్‌ను ప్రస్తుతం ప్రభుత్వ భూమిగా చూపుతున్నారు. అదే రెవెన్యూలో సర్వే నంబర్ 587తో పాటు మరికొన్ని నంబర్లతో కలిపి 2022లో హెచ్‌ఎండీఏ అనుమతులతో వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ నంబర్‌ను భూదాన్ భూమిగా చూపుతున్నారు. సర్వే నంబర్ 106లో 20.28 ఎకరాలు, సర్వే నంబర్ 497లో 16.19 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా చూపారు. మహ్మద్‌నగర్ సర్వే నంబర్ 2లో సైతం 5.14 ఎకరాలను ప్రభుత్వ భూమిగా చూపారు. అందులో కొంత భాగంలో హెచ్‌ఎండీఏ అనుమతులతో వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ భూముల్లో లావాదేవీలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ల కోసం సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లిన వారికి రెవెన్యూ అధికారుల నుంచి ఎన్‌ఓసీ తెస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతున్నారు. దీంతో అవసరానికి పొలాలు విక్రయిద్దామనుకునే రైతులకు, ఇటు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ప్రభుత్వ, భూదాన్‌గా పట్టా భూముల మార్పు
నిషేధిత జాబితాలో నమోదు చేసిన అధికారులు
ఆందోళనలో రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు


