సాగునీరందించడమే లక్ష్యం
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని అన్ని మండలాలకు సాగునీరందించడమే లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సాక్షితో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రకటించగా, ఏడవ గ్యారంటీగా తను కల్వకుర్తికి సాగునీరందించనున్నట్లుగా చెప్పారు. పెండింగ్‌లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ82 కాల్వ పనులను పూర్తి చేయించి ఆమనగల్లు, మాడ్గుల, వెల్దండ మండలాల్లో 35వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. నియోజక వర్గంలో ఈ ఏడాది దాదాపు రూ.600 కోట్లతో బీటీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఆమనగల్లులో డివిజన్ కార్యాలయాల ఏర్పాటు, అపరిష్కృతంగా ఉన్న జూనియర్ కాలేజీ భవన నిర్మాణం చేపడతామని ఆయన పేర్కొన్నారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో రూ.125 కోట్లతో చేపట్టే ఇంటిగ్రెటేడ్ స్కూల్ నిర్మాణ పనులను వచ్చే ఏడాదిపూర్తి చేయిస్తామన్నారు. తనపై విమర్శలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా కల్వకుర్తి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని ఆయన వెల్లడించారు.


