అతివేగంతో అదుపుతప్పిన కారు
ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు
మహేశ్వరం: అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహేశ్వరం ఠాణా పరిధి మెహబ్బత్‌నగర్ గేటు సమీపంలో శ్రీశైలం రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. కందుకూరు మండలం నేదునూరుకు చెందిన సిరిగిరి ప్రవీణ్ చారి(38) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రవీణ్ అతని స్నేహితులతో కలిసి కందుకూరు గేటు నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మోహబ్బత్‌నగర్ గేటు సమీపంలోని సామ సంజీవరెడ్డి ఫంక్షన్ హాలు వద్దకు రాగానే కారును అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రవీణ్ చారి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మాధవన్‌జీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


