ఐదుశాతమే క్లియర్‌! | - | Sakshi
Sakshi News home page

ఐదుశాతమే క్లియర్‌!

Aug 21 2025 11:59 AM | Updated on Aug 21 2025 11:59 AM

ఐదుశాతమే క్లియర్‌!

ఐదుశాతమే క్లియర్‌!

మంచాలలో అత్యధికం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జూన్‌ మూడు నుంచి 21 వరకు గ్రామాల వారీగా భూభారతి సదస్సులు నిర్వహించింది. జిల్లాలోని 27 మండలాల పరిధిలో 613 రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి మొత్తం 22,139 దరఖాస్తులను స్వీకరించారు. వీటిలో 8,966 మిస్సింగ్‌ సర్వే నంబర్లకు సంబంధించిన అర్జీలుండగా.. 1,652 సక్సేషన్‌, 1,557 నిషేధిత జాబితా నుంచి తొలగింపు, 1,158 డీఎస్‌ పెండింగ్‌, 1,932 విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, 967 భూ స్వరూపంలో మార్పులు, 742 పేర్ల నమోదులో దొర్లిన తప్పులను సరి చేయడం, 656 అసైన్డ్‌ భూముల సమస్యలు, 142 ఓఆర్‌సీ నాట్‌ ఇష్యూడ్‌, 2217 ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులున్నాయి. ఆయా దరఖాస్తులన్నింటికీ ఆగస్టు 15 లోగా ఓ పరిష్కార మార్గం చూపించాల్సిందిగా జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు రెవెన్యూ అధికారులు దరఖాస్తుల పరిశీలన పేరుతో రోజుల తరబడి హడావుడి చేసి బాధితులకు నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటివరకు ఐదు శాతం దరఖాస్తులకే పరిష్కారం చూపారు.

ఆ మూడు విభాగాల్లోనూ..

భూ సమస్యల్లో ప్రధానమమైన మూడు అంశాలున్నాయి. వీటిలో డేటా కరెక్షన్‌ కోసం 5,504 దరఖాస్తులు రాగా, వీటిలో 392 అర్జీలకు ఆమోదముద్ర వేశారు. 36 దరఖాస్తులను తిరస్కరించి, మరో 300 క్యాన్సల్‌ చేశారు. 4,776 అర్జీలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. సక్సేషన్‌ కోసం 235 దరఖాస్తులు అందగా, వీటిలో ఇప్పటివరకు 42కు ఆమోదముద్ర వేశారు. ఒకటి తిరస్కరించారు. మరో 10 దరఖాస్తులను క్యాన్సల్‌ చేశారు. మరో 182 పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక మ్యూటేషన్‌ కోసం 155 రాగా, వీటిలో 25 మాత్రమే ఆమోదం తెలిపారు. తొమ్మిది తిరస్కరించగా.. 121 పెండింగ్‌లో పెట్టారు. చేవెళ్లలో అత్యధికంగా 84 దరఖాస్తులు, జిల్లేడుచౌదరిగూడలో 59 అర్జీలు ఆమోదం పొందాయి. ఇప్పటికీ భూ బాధితులు తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో మెజార్టీ సమస్యలు భూ బాధితుల నుంచే అందుతుండటం గమనార్హం.

అదనపు కలెక్టర్‌ వద్దే 4,600

‘ధరణి’ పోర్టల్‌లో అన్ని దరఖాస్తులను కలెక్టరే స్వయంగా ఆమోదించడమో? తిరస్కరించడమో? చేయాల్సి వచ్చేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. సాంకేతికంగా పలు సంస్కరణలను కూడా ప్రవేశపెట్టింది. అప్పటి వరకు కలెక్టర్‌కు మాత్రమే ఉన్న లాగిన్‌ను ఆ తర్వాత తహసీల్దార్‌, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లకు కూడా కల్పించింది. ఆయా అధికారుల పరిధిలోనే మెజార్టీ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు. కానీ జిల్లాలోని ఒక్క అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) వద్దే 4,600 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు మరికొంత సమయం పడుతుందని, భూ బాధితులంతా ఓపిక పట్టాలని సూచిస్తూ ఆయన చాంబర్‌ ఎదుట నోటీసు బోర్డు పెట్టడం గమనార్హం.

భూ భారతి సదస్సుల్లో భాగంగా మంచాల మండలంలో అత్యధికంగా 2,943 దరఖాస్తులు అందగా, వీటిలో 2,942 మందికి నోటీసులు జారీ చేశారు. వీటిలో డేటా కరెక్షన్‌ కోసం 86 అర్జీలు రాగా, ఇప్పటి వరకు కేవలం ఒక దరఖాస్తును మాత్రమే ఆమోదించారు. మిగిలినవన్నీ ఇప్పటికీ పరిశీలన దశలోనే ఉన్నాయి. చేవెళ్ల మండలంలో 1,009 దరఖాస్తులు అందగా, అధికారులు పరిశీలించి వీటిలో 364 అర్జీలను తిరస్కరించారు. మిగిలిన 645 అప్లికేషన్లలో 310 ఆమోదించారు. మరో 335 పెండింగ్‌లో పెట్టారు. యాచారంలో 2,082 దరఖాస్తులు అందగా, వీటిలో కేవలం 33 మాత్రమే ఆమోదించారు. ఇక కందుకూరులో 1,842 దరఖాస్తులకు 34 దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందాయి. ఇలా కేవలం ఈ మూడు మండలాల్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న 27 మండలాల నుంచి 22,139 దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 1,011 అర్జీలు మాత్రమే ఆమోదించారు. మిగిలిన వారికి కేవలం నోటీసులు జారీ చేసి వదిలేశారు.

పారదర్శకత లోపించిన రెవెన్యూ సదస్సులు

జిల్లా వ్యాప్తంగా 22,139 అర్జీల స్వీకరణ

1,011 ఆమోదం.. మరో 50 తిరస్కరణ

నోటీసులతో సరిపెడుతున్న అధికారులు

ఆందోళనలో భూ బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement