డ్వాక్రా అక్రమాల వడపోత | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రా అక్రమాల వడపోత

Aug 21 2025 11:52 AM | Updated on Aug 21 2025 11:59 AM

డ్వాక్రా అక్రమాల వడపోత

డ్వాక్రా అక్రమాల వడపోత

నివేదిక ఆధారంగా చర్యలు

యాచారం: గ్రామ స్వయం సహాయక సంఘాల్లో నిధుల స్వాహా, అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు అధికార యంత్రాంగం వడపోత ప్రారంభించింది. ఏడాది వ్యవధిలోనే మండల పరిధిలోని మల్కీజ్‌గూడ, చౌదర్‌పల్లి గ్రామాల్లో రూ.లక్షల నిధులు దుర్వినియోగంపై జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుట్టను తవ్వి అక్రమాల పాములను పట్టేందుకు అటు ఐకేపీ, ఇటు ఎస్‌బీఐ ఉన్నతాధికారులు విచారణను ముమ్మరం చేశారు. మహిళల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న అధికారులు ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంఘాలకు చెందాల్సిన నిధులను స్వాహా చేశారు. ఏడాదికి ఒక గ్రామంలో అక్రమాలు వెలుగులోకి వస్తుండడం, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు, రికవరీ లేకపోవడంతో మిగతా గ్రామాల్లో అవినీతి వ్యవహారం రాజ్యమేలుతోంది. మండలాల్లోని స్వయం సహాయక సంఘాల్లో నిధుల గోల్‌మాల్‌పై విచారణ పూర్తి చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

విచారణకు ప్రత్యేక కమిటీ

చౌదర్‌పల్లి గ్రామ స్వయం సహాయక సంఘాల్లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై నిగ్గు తేల్చేందుకు డీఆర్‌డీఓ శ్రీలత ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. కమిటీలో ఇద్దరు డీపీఎంలు యాదయ్య, లీలాకుమారి, ఇద్దరు ఐకేపీ ఆడిటర్లు శ్రీనివాస్‌, మధు ఉంటారు. ప్రత్యేక విచారణ కమిటీకి స్థానిక ఏపీఎం రవీందర్‌ సహకారం అందిస్తారు. పది రోజుల్లోనే పూర్తి నివేదిక అందజేయనుంది. చౌదర్‌పల్లిలో వీబీకే వరలక్ష్మి పర్యవేక్షణ చేస్తున్న 30 స్వయం సహాయక సంఘాల్లోని ఆర్థిక లావాదేవీలపై 2020 నుంచి విచారణ చేయనున్నారు. వాటికి సంబంధించి పొదుపు, లోన్‌, సీ్త్రనిధి అకౌంట్లు యాచారం ఎస్‌బీఐలో స్టేట్‌మెంట్లు తీసుకుని పరిశీలించనున్నారు. శుక్రవారం నుంచి గ్రామంలోని సంఘాల మహిళలతో ప్రత్యేక సమావేశమై వివరాలు సేకరించనున్నారు. యాచారం ఎస్‌బీఐలో 2020 నుంచి మేనేజర్ల అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా సంఘాల్లో లేని మహిళల పేర్ల మీద డబ్బులు జమ చేయడంపై బ్యాంక్‌ ఏజీఎం రామకృష్ణయ్య ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. అప్పటి ఎస్‌బీఐ మేనేజర్‌ ఝాన్సీరాణి నాటి మల్కీజ్‌గూడ, నేటి చౌదర్‌పల్లి గ్రామాల్లోనే కాక బ్యాంకు పరిధి కింద ఉన్న పలు గ్రామాల్లో ఐకేపీ సిబ్బందితో కుమ్మకై అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.

షోకాజ్‌ నోటీసులు జారీ

ఏడాదిలోనే మల్కీజ్‌గూడ, చౌదర్‌పల్లి గ్రామాల్లో డ్వాక్రా సంఘాల్లో రూ.లక్షల నిధుల గోల్‌మాల్‌ అక్రమాలపై పర్యవేక్షణ చేయని ఏపీఎంలు(బదిలైన) సుదర్శన్‌రెడ్డి, సాంబశివుడు, సీసీ జంగయ్యకు డీఆర్‌డీఓ శ్రీలత బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. నాలుగైదు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో ఏళ్లుగా అదే స్థానంలో పనిచేస్తున్న సీసీ(కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు)లు కూడా పట్టించుకోవడం లేదని అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న సీసీలను బదిలీలు చేసేలా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

చౌదర్‌పల్లిలో డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన నిధుల గోల్‌మాల్‌ అక్రమాలపై ఓ నలుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించాం. ఈ కమిటీ వారంలో నివేదిక అందజేయనుంది. బాధ్యులైన వారిపై చర్యలుంటాయి. ఇద్దరు ఏపీఎంలు, సీసీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. అక్రమాలకు పాల్పడే వీబీకేలపై కూడా చర్యలు తప్పవు.

– శ్రీలత, డీఆర్‌డీఓ

నిధుల స్వాహాపై విచారణ

చౌదర్‌పల్లిలో అవకతవకలపై ఏపీఎంలకు షోకాజ్‌ నోటీసులు

మహిళా సంఘాల్లో భారీ గోల్‌మాల్‌

లోతుగా పరిశీలిస్తున్న అధికారులు

త్వరలోనే చట్టపరమైన చర్యల దిశగా అడుగులు

జిల్లా వ్యాప్తంగా సీసీల బదిలీలకు రంగం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement