
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగు పర్చాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆమె అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం వంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా తనిఖీలు–తెలంగాణ ప్రభుత్వం లేబర్, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ విభాగం జారీ చేసిన జీవో ఆర్టీ నంబరు 331 ప్రకారం జిల్లా కలెక్టర్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. వాటి ద్వారా తక్షణమే పరిశ్రమల ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. అన్ని కెమికల్ పరిశ్రమల్లో నిబంధనలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కార్మికుల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీలక్ష్మి, పీసీబీ ఈఈఈ వెంకటనర్సు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్యాంసుందర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎన్‌జీ వైదేహి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి సంగీత